తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి

తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి
  • తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకుల డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. తొలిదశ ఉద్యమం స్ఫూర్తితో మలిదశ ఉద్యమం మొదలై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. మంగళవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న1969 ఉద్యమకారులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ.. తొలిదశ ఉద్యమంలో 369 మంది పోలీసుల తూటాలకు బలయ్యారన్నారు. 

స్టూడెంట్లు ఏడాది పాటు చదువుకు దూరమై జైలు పాలయ్యారని, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితేనే తమ బతుకులు మారుతాయని అనుకున్నామని, గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ తమను పట్టించుకోలేదన్నారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

తమను గుర్తించేందుకు ఎఫ్ఐఆర్,  జైలు రికార్డును చూపించాలని పెట్టిన ప్రతిపాదనతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వమే ఓ కమిటీ వేసి తమ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించాలని కోరారు. సీతారాంరెడ్డి, లక్ష్మీనారాయణ, వనం చంద్రమౌళి, మోహన్ రావు, కృష్ణమూర్తి, కంది సూర్యనారాయణ, సీహెచ్ విశ్వేశ్వర్ రావు, కె.మోహన్ రావు  పాల్గొన్నారు.