
వెలుగు నెట్‌వర్క్: వివిధ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో పరిధిలో ఆందోళన చేపట్టిన ఐదుగురు కార్మిక సంఘాల నాయకులు ఆర్ సుధాకర్(డ్రైవర్), ఎం రవీందర్(డ్రైవర్), ఎండీ మౌలానా(మెకానిక్), బొల్లం రాకేష్ ఖన్నా(కండక్టర్), భూక్య నాయక్(డ్రైవర్) పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరంతా ఆరు రోజులుగా కరీంనగర్ జైలులో మగ్గుతున్నారు. బుధవారం వీరు పెట్టుకున్న బెయిల్ ఫిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం శనివారం లోపు దాఖలు చేసుకోవచ్చని సూచించింది. సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్– జగిత్యాల రహదారిపై బుధవారం ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
వీరికి మద్దతుగా పీడీఎస్యూ, పౌరహక్కుల సంఘం, కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు.144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ 22 మంది కార్మికులు, పలు సంఘాల నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై147, 341, 186, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జగిత్యాల సీఐ జయేష్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 50 మంది ఆర్టీసీ కార్మికులపై పోలీసులు సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు. సమ్మె ప్రారంభం రోజు బస్సు సైడ్ అద్దం పగులగొట్టాడనే ఆరోపణలతో రమేశ్ అనే కండక్టర్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేస్ బుక్ చేశారు.