- ఐపీసీ సెక్షన్లు 341, 353, 332, 427, 34 ద కేసులు నమోదు
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్జీసీ అధ్యక్షుడు మాదేశ్ తో పాటు సాయిచరణ్, శ్రీను, ప్రశాంత్ లపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ 341, 353, 332, 427, 34 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
ఆందోళనలు, ధర్నాలు, నిరసనలకు క్యాంపస్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, లోపలి వీడియోలు, సమాచారం బయటకు పంపిస్తున్నందుకు ఎస్జీసీ నాయకులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళనలు శాశ్వతంగా నిరోధించే దిశలో.. కేసులు పెడుతున్నట్లు విద్యార్థులు అనుమానిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కోర్సు చదువుతున్న రాథోడ్ సురేష్ (18) హాస్టల్ రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన విద్యార్థులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సురేష్ మృతికి నిరసనగా నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనం ధ్వంసం అయింది. ఘటనలపై పోలీసులు ఇవాళ ఉదయమే కేసులు నమోదు చేశారు. విషయం తెలిసిన విద్యార్థి నాయకులు కేసుల గురించి మాట్లాడేందుకు బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదైన విద్యార్థులు బయటకు వెళ్లకుండా అవుట్ పాస్ లను రద్దు చేసినట్లు చెప్పారు. మేమేం ఉగ్రవాదులమా.. ఎందుకు అడ్డుకుంటారంటూ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎస్జీసీ అధ్యక్షుడు సహా నలుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలియడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
