ATM సెంటర్ల క్యాష్ డిపాజిట్లలో రూ. కోటి 23 లక్షలు గోల్ మాల్

ATM సెంటర్ల క్యాష్ డిపాజిట్లలో రూ. కోటి 23 లక్షలు గోల్ మాల్

హైద‌రాబాద్: ఏటీఎం సెంట‌ర్ల‌లో క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బంది గోల్ మాల్ చేస్తూ డ‌బ్బును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా జ‌రుగుతున్న ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సికింద్రాబాద్ కేంద్రంగా సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ..వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం యంత్రాలలో డబ్బు డిపాజిట్ చేసే కాంట్రాక్ట్ తో క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ రీప్లేస్ మెంట్ సర్వీస్ నిర్వహిస్తుంది. ఈ సర్వీసెస్ కోసం సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. బి టి ఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 36 ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్ చేసేందుకు బి టి ఐ కు అప్పగించింది. బి టి ఐ లో రాజశేఖర్ రెడ్డి, రమా భారత్, సాయి తేజ, అశ్విన్ లను కస్టోడియన్లుగా నియమించి ఏటీఎం తాళాలు, పాస్ వర్డులు వారికి అప్పగించారు.

అన్ని రూట్లలో వారు ATM లకు వ్యవహారాల రిపోర్టులు ఎప్పటికప్పుడు అందించారు. రాజశేఖర్ రెడ్డి తో పాటు మిగతా ముగ్గురు కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న రూట్లలో రిపోర్టు రాకపోవడంతో.. కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్ నిర్వహించారు. ఈ ఆడిటింగ్ లో రూ. కోటి 23 లక్షల నగదు తక్కువగా ఉంది. దీంతో రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా ముగ్గురని కంపెనీ ప్ర‌తినిధులు ప్రశ్నించ‌గా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ శ్రీనివాస్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.