ఇక అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్

ఇక అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్

హైదరాబాద్, వెలుగు : హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్న వ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) తీసుకొచ్చిన కొత్త రూల్‌‌ అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకుంటే, ఆ కంపెనీకి సంబంధించిన నెట్‌‌వర్క్ హాస్పిటల్స్‌‌లోనే క్యాష్‌‌లెస్ విధానంలో ట్రీట్‌‌మెంట్ తీసుకునే అవకాశం ఉండేది. నెట్‌‌వర్క్‌‌లో  లేని హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటే, తొలుత బిల్లు చెల్లించి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లులు సమర్పించి రీయింబర్స్‌‌మెంట్‌‌ చేసుకోవాల్సి వచ్చేంది. 

దీని వల్ల చేతిలో డబ్బులు ఉంటేనే ట్రీట్‌‌మెంట్ చేయించుకునే పరిస్థితి ఉండేది. ఆపదలో ఆదుకోవాలన్న ఇన్సూరెన్స్ ప్రాథమిక లక్ష్యానికి ఈ నిబంధన అడ్డుగా ఉందని చాలా కాలంగా ఒక వాదన ఉంది. ఈ నిబంధనను తొలగించి అన్ని హాస్పిటళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న డిమాండ్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్ నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో పలుమార్లు రెగ్యులేటరీ చర్చించింది. వారి సూచన మేరకు గతేడాది చివరలో కొన్ని కండీషన్లతో కామన్ నెట్‌‌వర్క్ నిబంధనలకు  ఓకే చెప్పింది. ఈ కొత్త రూల్ బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. 

నిబంధనలు ఏమిటంటే..

కొత్త రూల్ ప్రకారం హెల్త్‌‌ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి తనకు నచ్చిన ఏ హాస్పిటల్‌‌కు అయినా వెళ్లి క్యాష్‌‌లెస్ విధానంలో ట్రీట్‌‌మెంట్ పొందొచ్చు. అయితే, ఈ విషయాన్ని ముందుగానే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయితే, అడ్మిట్ అయిన 48 గంటల లోపల ఇన్సూరెన్స్ కంపెనీకి విషయం తెలియజేయాలి. నాన్ ఎమర్జన్సీ, ప్లాన్డ్, షెడ్యూల్డ్ సర్జరీలయితే హాస్పిటల్‌‌లో  చేరడానికి 48 గంటల ముందు ఎప్పుడైనా సమాచారం ఇవ్వచ్చు.