
- ప్రభుత్వం చేసిన గణన ఎందుకివ్వరని ప్రశ్న
- కౌన్సిల్ చైర్మన్ ఆఫీస్లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన మల్లన్న
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అధికారికంగా చేసిన కులగణన లెక్కలను బయటపెట్టాలని టీఆర్ పీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. కులగణన లెక్కలు ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు కులగణన లెక్కలు ఇవ్వాలని కోరుతూ బుధవారం మండలిలోని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పీఎస్ కు టీఆర్ పీ నేతలు సంగెం సూర్యారావు, సుదగాని హరిశంకర్ గౌడ్ తో కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసును అందజేశారు.
అనంతరం మండలి మీడియా పాయింట్ లో మాట్లాడారు. అన్ని కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందని.. అలాంటపుడు గణన వివరాలను గ్రామ పంచాయతీలు, వార్డులు, కులాల వారీగా జనాభా వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్సీగా ఈ వివరాలు తెలుసుకునే హక్కు తనకు ఉందన్నారు. వివరాలు ఇవ్వకుండా లేట్ చేస్తున్నందున కౌన్సిల్ చైర్మన్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చానని ఆయన వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామని కులగణన చేయకముందే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించారని, ఇప్పుడు కులగణన చేశారన్నారు.
డెడికెటేడ్ కమిషన్ ను ఏర్పాటు చేసి.. అసెంబ్లీలో చట్టం చేసి, గవర్నర్ ఆమోదం పొంది పార్లమెంట్ లో ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదించి, 9వ షెడ్యూల్ లో చేర్చిన తరువాతే రిజర్వేషన్లు పెరుగుతాయని మల్లన్న తెలిపారు.
2019 నుంచి తెలంగాణలో 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఏ రిపోర్ట్, ఏ లెక్క ఆధారంగా అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఓసీల జనాభా రాష్ట్రంలో ఎంత ఉందో చెప్పాలన్నారు. పబ్లిక్ గా చేసిన సర్వేను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎందుకు ఇవ్వడం లేదని.. కులగణన నివేదికను ఇంత సీక్రెట్ గా ఎందుకు దాస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు.