కక్షతో కుల బహిష్కరణ.. ఏసీపీని ఆశ్రయించిన బాధితుడు   

కక్షతో కుల బహిష్కరణ.. ఏసీపీని ఆశ్రయించిన బాధితుడు   

యాదాద్రి భువనగిరి జిల్లా: చట్టాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులున్నా ఇంకా పలు గ్రామాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తూ పంచాయతీ తీర్పులు చెబుతున్నారు పెద్దమనుషులు. ఓ యువకుడి దగ్గర భారీగా డబ్బులు డిపాజిట్ చేయించుకున్న కుల పెద్ద మనుషులు చివరకు అతడికి న్యాయం చేయకపోగా.. కులం నుండి వెలేశారు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపారానికి రావడంలేదని పంచాయితీ పెడితే, సంసారాన్ని చక్కదిద్దాల్సిన పెద్ద మనుషులే ఇలా ప్రవర్తించారని.. ఇక చేసేదేమీలేక స్థానిక కలెక్టర్, ఏసీపీ ని ఆశ్రయించాడు బాధితుడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

వివరాలు: భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన చిన్నం రవికుమార్(28)కు వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన లాస్యతో 2016లో వివాహం అయ్యింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. చిన్న గొడవతో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదం కుల పెద్దల వద్దకు వెళ్లింది. దీంతో పంచాయితీలో పెద్ద మనుషులు రవికుమార్ భార్యపైన 2 ఎకరాల భూమి రిజిష్ట్రేషన్ చేస్తేనే కాపురానికి పంపిస్తామంటూ తీర్మానం చేశారు. దీనికి రవి ఫ్యామిలీ ఒప్పుకోలేదు.  తాను ఒక్కడినే కొడుకునని అమ్మానాన్న బతికుండగానే ఎలా భూమి లాక్కోవాలని తన భార్యకు వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు రవి. అయితే తల్లిదండ్రులు, పెద్ద మనుషుల మాటలను నమ్మిన లాస్య.. తన భర్త రవి చెప్పే మాటలను లెక్క చేయకుండా తల్లిదండ్రులతో వెళ్లి పోయింది.

ఇలా 4 సంవత్సరాలు గడిచింది. ఇదే విషయంపై మరోసారి పంచాయితీ పెట్టగా కుల పెద్దలు రవి నుంచి రూ.75 వేలు డిపాజిట్ తీసుకున్నారు. అయినా భార్యను కాపురానికి పంపకపోగా.. కుల పెద్దల మాటలను లెక్క చేయడంలేదని, రూ.75 వేలు ఇవ్వలేదు. ఇదేంటని రవి ఫ్యామిలీ ప్రశ్నిస్తే.. చివరకు రవి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు కుల పెద్దలు. కులంలో ఎవ్వరు చనిపోయినా రానివ్వట్లేదని.. పెళ్లి, వగైర కార్యక్రమాలకు తమకు ఆహ్వనం ఇవ్వడంలేదని తెలిపాడు బాధితుడు చిన్నం రవి కుమార్. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి కుమార్.. న్యాయం చేయాలని ఏసీపీ భుజంగరావుకు వినతి పత్రం అందజేశాడు.