మా ఊర్లో కుల వివక్ష రిపీట్​ కానివ్వం

మా ఊర్లో కుల వివక్ష రిపీట్​ కానివ్వం
  • మెదక్​ జిల్లా తిమ్మాపూర్ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

జగదేవపూర్, వెలుగు :  గ్రామస్తులమంతా ఒక్కటేనని, తమ ఊర్లో కుల వివక్ష రిపీట్​ కానివ్వం అంటూ జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామస్తులు తీర్మానించారు. గ్రామంలోని దళితులకు షాపుల్లో కటింగ్ ​చేయడం లేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం గ్రామస్తులంతా సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తీర్మానించారు. ఆ పేపర్లను జగదేవపూర్ తహసీల్దార్​రఘువీరారెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తిలకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో కుల వివక్ష లేదని, దళితులను ఎక్కడా  అవమానించలేదన్నారు.  

గ్రామానికి వచ్చిన ప్రజాసంఘాల నాయకులు

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మోహన్, కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, దళిత జర్నలిస్ట్స్​ వర్కింగ్ వెల్ఫేర్​సొసైటీ అధ్యక్షుడు రాజలింగం, జనార్దన్, చంద్రం శుక్రవారం గ్రామానికి వచ్చి దళితులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  ప్రజా సంఘూల నాయకులు కృష్ణమూర్తి, శివదాసు, రామస్వామి, రాజు, కరుణకర్, నవీన్ పాల్గొన్నారు.