రూ. 30 వేలు తీసుకుంటూ..సీబీఐకి చిక్కిన పోస్టల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌

రూ. 30 వేలు తీసుకుంటూ..సీబీఐకి చిక్కిన పోస్టల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌

 

  • సీబీఐ ఆఫీసర్లను చూసి పరార్‌‌
  • ఫోన్‌‌ సిగ్నల్‌‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు

వనపర్తి/వనపర్తి టౌన్‌‌, వెలుగు : అదనపు విధులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన వనపర్తి డివిజన్‌‌ పోస్టల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ను సీబీఐ ఆఫీసర్లు పట్టుకున్నారు. సీబీఐ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి డివిజన్‌‌ పోస్టల్‌‌ ఆఫీస్‌‌లోని ఉద్యోగులకు అదనపు విధులకు సంబంధించిన డబ్బులు ఇటీవల మంజూరు అయ్యాయి. 

ఆ డబ్బులను ఉద్యోగులకు చెల్లించేందుకు 30 శాతం కమీషన్‌‌ ఇవ్వాలని ఇన్‌‌స్పెక్టర్‌‌ గోపీనాథ్‌‌ డిమాండ్‌‌ చేశారు. కొందరు ఉద్యోగులు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు సీబీఐ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఓ ఉద్యోగి గోపినాథ్‌‌ను కలిసి రూ. 30 వేలు ఇచ్చాడు. తర్వాత బయటకు వచ్చి ఆఫీస్‌‌ ఆవరణలో కొందరు వ్యక్తులతో మాట్లాడుతుండడాన్ని గోపీనాథ్‌‌ తన ఛాంబర్‌‌లోని సీసీ టీవీలో చూశారు. 

సీబీఐ ఆఫీసర్లని అనుమానం రావడంతో పక్కనే ఉన్న ఓ ఉద్యోగికి డబ్బులు ఇచ్చి.. ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోయి, ఫోన్‌‌ స్విచాఫ్‌‌ చేశాడు. ఇన్‌‌స్పెక్టర్‌‌ గోపీనాథ్‌‌ పారిపోయిన విషయం తెలుసుకున్న సీబీఐ ఆఫీసర్లు.. అతడి ఫోన్‌‌ ఆధారంగా ట్రేస్‌‌ చేసి మదనాపూర్‌‌లో ఉన్నట్లు గుర్తించి గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా విచారణ జరిపి ఆస్తుల వివరాలు తెలుసుకున్నారు. 

అతడి ఆఫీస్‌‌, నివాసంలో తనిఖీలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సీబీఐ ఇన్‌‌స్పెక్టర్లు సంతోష్‌‌కుమార్‌‌, ప్రకాశ్‌‌కుమార్‌‌, పింకీ చేతన్‌‌ పాల్గొన్నారు.