లిక్కర్ స్కాం: అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ పొడగింపు

లిక్కర్ స్కాం: అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ పొడగింపు

ఢిల్లీ : లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కస్టడీ పొడగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు కస్టడీని మరో 5 రోజులు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 14న రౌస్ అవెన్యూ కోర్టు అభిషేక్ రావు, విజయ్ నాయర్లకు 5 రోజుల కస్టడీ విధించింది. అది నేటితో ముగియడంతో ఈడీ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచాడు. కస్టడీ పొడగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం మరో 5 రోజుల కస్టడీకి అనుమతించింది. తదుపరి విచారణను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. 

లిక్కర్ స్కాంకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు కస్టడీని కోర్టు ఇప్పటికే ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు విచారణలో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం రాబిన్ డిస్ట్రిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నించారు. సౌత్ లాబీ గ్రూప్ నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన డబ్బుపై వీరిని ప్రశ్నించినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ నుంచి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించారని ఈడీ మొదటి నుంచి అనుమానిస్తోంది.