అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. వాట్సప్ కాల్స్ పై ఆరా..

అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. వాట్సప్ కాల్స్ పై ఆరా..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు ( జూన్ 3) సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రశ్నించారు. సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన వద్ద ఉన్న  ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని .. విచారణ పూర్తయ్యాక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున చేసిన వాట్సాప్ కాల్స్ వివరాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కోర్టులోనూ ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది సీబీఐ. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరెస్ట్  టెన్షన్ లేకపోయింది. అందుకే ఈ సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసు వద్ద పెద్దగా ఆయన అనుచురుల గుమికూడలేదు.

గతంలో సీబీఐ చెప్పిన ప్రకారం 6 అంశాలకు సంబంధించి అవినాశ్ రెడ్డి నుంచి క్లారిటీ రావాలన్న దానిపై ఈ రోజు  ( జూన్ 3) ప్రశ్నించారు.   వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి జగన్‌కు ఎవరి ద్వారా ముందు తెలిసింది అనే అంశంపై సీబీఐ ప్రశ్నించినప్పుడు అవినాశ్ రెడ్డి తాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తర్వాత సమాచారం ఇచ్చానని చెప్పినప్పటికీ కూడా 6.15 నిమిషాలకు బయటకు వస్తే.. 6.15 నిమిషాలకు ముందే అవినాశ్ రెడ్డి ఈ విషయం తెలిసిన తర్వాత జగన్‌కు తెలియజేశాడనేది ప్రధానమైన అభియోగం. ఆ అభియోగానికి సంబంధించే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వాట్సాప్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రిట్రైవ్ చేయడం కానీ, సీబీఐ సేకరించిన టెక్నికల్ ఆధారాలతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందని, విచారణలో కీలక విషయాలు బయటపడాల్సి ఉందని, మరో శనివారం విచారణకు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేదా కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని సీబీఐ భావిస్తే మరోసారి నోటీసు జారీ చేసి ఈ వారంలోనే విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.