గ్రానైట్​ అక్రమ రవాణాపై సీబీఐ పూర్తిస్థాయి ఎంక్వైరీ షురూ

గ్రానైట్​ అక్రమ రవాణాపై  సీబీఐ పూర్తిస్థాయి ఎంక్వైరీ షురూ
  • కరీంనగర్ నుంచి ఎంత తరలిందన్న కోణంలో విచారణ
  •  9కంపెనీల నుంచి అక్రమ ట్రాన్స్​పోర్ట్ ​జరిగినట్లు గతంలో గుర్తింపు

హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నుంచి కాకినాడ పోర్ట్​ ద్వారా జరిగిన గ్రానైట్​అక్రమ రవాణాపై ఈడీతో కలిసి సీబీఐ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​ పేరాల శేఖర్​రావు ఫిర్యాదు మేరకు గ్రానైట్​ అక్రమాలపై ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణ చేస్తున్నాయి. 
తాజాగా పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విశాఖలోని సీబీఐ ఆఫీసర్లకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది.  కాకినాడ పోర్టు నుంచి గ్రానైట్ అక్రమ రవాణాపై పేరాల శేఖర్‌‌‌‌రావు సీబీఐకి గతంలోనే కంప్లయింట్ చేశారు. ప్రభుత్వానికి తక్కువ గ్రానైట్ తవ్వినట్లు చూపి, ఎక్కువ మొత్తంలో గ్రానైట్ ను విదేశాలకు​ తరలించడం ద్వారా వందల కోట్ల పన్నులు ఎగవేశారని పలు ఆధారాలిచ్చారు. ఈమేరకు సీబీఐ, ఈడీ విచారణ జరిపి గ్రానైట్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చాయి. ఇందుకు సంబంధించి పలు కంపెనీలకు రూ. 750 కోట్ల ఫైన్​విధించాయి.  అక్రమ రవాణాతో పాటు మనీలాండరింగ్​ జరిగినందున పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలన్న శేఖర్​రావు విజ్ఞప్తితో కిందటి ఏడాది నవంబర్ 1న విశాఖలోని సీబీఐ ఆఫీసర్లకు ఢిల్లీ సీబీఐ నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు శేఖర్ రావుకు విశాఖ సీబీఐ అధికారులు లెటర్​రాశారు.

9 కంపెనీల నుంచే అక్రమ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ 
 కాకినాడ పోర్ట్, రైల్వేస్ ద్వారా కరీంనగర్‌‌‌‌లోని శ్వేత ఏజెన్సీస్‌‌, ఏఎస్‌‌ షిప్పింగ్‌‌, జేఎమ్‌‌ బక్షి అండ్ కో, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌‌పోర్ట్‌‌, కేవీఎం ఎనర్జీ, అరవింద్‌‌ గ్రానైట్స్, సందియా ఏజెన్సీస్‌‌, పీఎస్‌‌ఆర్‌‌‌‌ ఏజెన్సీస్‌‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, లాజిస్టిక్స్‌‌ గ్రానైట్ నుంచి అక్రమ ట్రాన్స్​పోర్ట్​ జరిగినట్లు సీబీఐ గతంలోనే ప్రాథమికంగా తేల్చింది.