ఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత

ఆయేషా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత

విజయవాడ: మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి చుక్కెదురైంది. దోషులను తేల్చడం కోసం నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టేసింది. 2007 డిసెంబర్ 27వ తేదీన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురైన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు మిస్టరీ ఏళ్లు గడుస్తున్నా తెమలడం లేదు. 
అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య ఒకరకమైన మాటయుద్ధంతో కేసు సీబీఐ చెంతకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఎఫ్ఐఆర్, ఆధారాలను పరిశీలిస్తూ విచారణ జరుపుతోంది. మొత్తం ఏడుగురు నిందితులు అనుమానితులుగా భావిస్తూ నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో  సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ తోపాటు ఆయేషా మీరాతో కలసి హాస్టల్ లో ఉన్న స్నేహితురాళ్లను ప్రశ్నించాల్సి ఉందని.. వీరి సమాచారమే కేసుకు కీలకమని సీబీఐ పేర్కొంటూ నార్కో అనాలసిస్ పరీక్షకు అనుమతించాలని పిటిషన్ లో కోరింది. నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అభ్యంతరం తెలుపగా.. ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.