ధన్వంతరి ఫౌండేషన్​ ఆస్తులు ఫ్రీజ్ : సీసీఎస్​ డీసీపీ ఎన్​.శ్వేత

ధన్వంతరి ఫౌండేషన్​ ఆస్తులు ఫ్రీజ్ : సీసీఎస్​ డీసీపీ ఎన్​.శ్వేత
  • త్వరలోనే బాధితులకు న్యాయం

బషీర్ బాగ్, వెలుగు: అధిక వడ్డీల ఆశ చూపి వేల మందిని మోసం చేసిన ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆస్తులను ఫ్రీజ్ చేశామని, త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని హైదరాబాద్ ​సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేత హామీ ఇచ్చారు. సోమవారం బషీర్ బాగ్​లోని సీసీఎస్ ఆఫీసులో బాధితులతో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకుడు కమలాకర్ శర్మ, పలువురు డైరెక్టర్లపై టీఎస్ పీడీఎఫ్ఈ యాక్ట్ కింద ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఫౌండేషన్​ నిర్వాహకులు అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి దాదాపు 4 వేల మంది సీనియర్ సిటిజన్స్ నుంచి రూ.514 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. విచారణలో ఫౌండేషన్​కు సంబంధించిన 30 బ్యాంక్ అకౌంట్లు, అంబర్ పేటలోని డీఎఫ్ఐ హాస్పిటల్, సిద్దిపేట జిల్లా మిడ్జిల్, ఏపీలోని అనకాపల్లి, గన్నవరం ఏరియాల్లోని 450 ఎకరాల భూమి, 3 వేల గజాల కమర్షియల్ ల్యాండ్​ను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆస్తుల వివరాలను కోర్టుకు అందజేసినట్లు వివరించారు. త్వరలోనే  బాధితులందరికీ న్యాయం జరుగుతుందని డీసీపీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సుమారు 200 మంది బాధితులు పాల్గొన్నారు.