‘గౌరవెల్లి’ ప్రాజెక్టుపై సీసీటీవీ కెమెరా .. పనులు నడవకుండా ఎన్జీటీ నిఘా

‘గౌరవెల్లి’ ప్రాజెక్టుపై సీసీటీవీ కెమెరా ..  పనులు నడవకుండా ఎన్జీటీ నిఘా
  • 12 చోట్ల కెమెరాల ఏర్పాటు

హుస్నాబాద్​, వెలుగు : పర్యావరణ అనుమతులు లేనందున గౌరవెల్లి రిజర్వాయర్  పనులను కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ) జారీచేసిన ఉత్తర్వును గోదావరి రివర్​ మేనేజ్ మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) అమలు చేస్తోంది. ఆ ప్రాజెక్టు వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పనులు నడవకుండా పర్యవేక్షించాలని ఎన్జీటీ ఆదేశించడంతో పదిరోజుల కింద జీఆర్ఎంబీ మెంబర్  సెక్రటరీ అలగేషన్, ఈఈ వెంకటస్వామితో పాటు పర్యావరణ శాఖ అధికారులు గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఈ రాములు ఇతర అధికారులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, పనులను ఆపాలని ఎన్జీటీ కోర్టు ఆదేశించినా ఎందుకు పనులు కొనసాగిస్తున్నారని జీఆర్ఎంబీ ఆఫీసర్లు ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి? వాటి ఫుటేజీలను ఎక్కడ భద్రపరచాలి? అన్న అంశాలను పరిశీలించారు. జీఆర్ఎంబీ అధికారుల సూచనల మేరకు శనివారం సీసీటీవీ కెమెరాల ఏజెన్సీ సిబ్బంది వచ్చి ప్రాజెక్టు వద్ద కెమెరాలను అమర్చారు. ప్రాజెక్టు ప్రదేశంలో ఎక్కడ ఎలాంటి పనులు నడిచినా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యేలా ముప్పై లొకేషన్లను ముందుగా డిసైడ్​ చేశారు. ప్రస్తుతం పన్నెండు ప్రదేశాల్లో కెమెరాలు అమర్చారు.