24 గంటల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు..ఇంటి నుంచే తీసుకోవచ్చు

24 గంటల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు..ఇంటి నుంచే తీసుకోవచ్చు
  •     ఇంటి నుంచే తీసుకునే అవకాశం
  •     ప్రకటించిన సీడీఎంఏ సత్యనారాయణ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌‌లలో బర్త్‌‌, డెత్‌‌ సర్టిఫికెట్లు 24 గంటల్లోనే జారీ చేస్తామని మున్సిపల్​ శాఖ కమిషనర్​ (సీడీఎంఏ) సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు యూజర్‌‌ ఐడీ, పాస్‌‌వర్డ్‌‌లు కేటాయించామన్నారు. ఆయా హాస్పిటళ్లలో పుట్టిన బిడ్డల పేర్లు యాజమాన్యాలు నమోదు చేస్తాయని, ఆ వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌‌కు ఎస్‌‌ఎంఎస్‌‌ వస్తుందన్నారు. ఫోన్ ద్వారా వచ్చిన లింక్‌‌ ఓపెన్‌‌ చేసి ఎక్కడి నుంచైనా సర్టిఫికెట్‌‌ డౌన్‌‌ లోడ్‌‌ చేసుకోవచ్చని చెప్పారు. ఇకపై బర్త్‌‌ సర్టిఫికెట్ల కోసం తల్లిదండ్రులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. డెత్‌‌ సర్టిఫికెట్ల జారీకి హాస్పిటళ్లతో పాటు శ్మశాన వాటికల నిర్వాహకులకు యూజర్‌‌ ఐడీ, పాస్‌‌ వర్డ్‌‌లు ఇచ్చామన్నారు. శ్మశాన వాటికల కోసం ప్రత్యేకంగా మొబైల్‌‌ యాప్‌‌ కూడా తీసుకువచ్చామన్నారు. హాస్పిటళ్లలో మరణించిన వారి వివరాలు ఆయా హాస్పిటళ్ల యాజమాన్యాలు, సహజంగా, ఇతర ప్రదేశాల్లో చనిపోయిన వారి వివరాలు శ్మశాన వాటికల నిర్వాహకులు అప్‌‌లోడ్‌‌ చేస్తారన్నారు. ఇన్‌‌స్టంట్‌‌ రిజిస్ట్రేషన్‌‌, అప్రూవల్‌‌, డౌన్‌‌లోడ్‌‌ విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. మార్చి 23 నుంచే ప్రయోగాత్మకంగా ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చామని ఇప్పటి వరకు 2,768 మందికి బర్త్‌‌, 167 డెత్‌‌ సర్టిఫికెట్లు ఈ విధానంలో జారీ చేశామని పేర్కొన్నారు.