హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లకు ఒకే రేటు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ (సీఈఏ) రాష్ట్ర కౌన్సిల్ సోమవారం మొదటిసారి సమావేశం అయింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ హాజరు కాగా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యారు. భేటీలో యూనిఫాం రేట్లపై ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో చర్చించారు.
అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో స్టాండర్డ్ రేట్లకు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ నిరాకరించాయని సమాచారం. సేవల నాణ్యత, డాక్టర్ల అనుభవం, ఇతర సౌకర్యాలను బట్టి అదనపు చార్జీలు విధించే వెసులుబాటు కల్పించాలని కౌన్సిల్ ను కార్పొరేట్ హాస్పిటల్స్ కోరాయని అధికారులు చెప్పారు. అయితే, తదుపరి జరిగే సమావేశంలో అభిప్రాయాలను వ్యక్తపరచాలని హాస్పిటల్స్ కు చెప్పినట్లు అధికారుల వెల్లడించారు.
కౌన్సిల్ మొదటి సమావేశం...
సోమవారం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు, ప్రైవేటు ఆసుపత్రుల విధానాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై చర్చించారు. ఐసీయూ, స్పెషాలిటీ సేవలు, మరణాల రేటు, బయోమెడికల్ వేస్టేజీ, ఫైర్ సేఫ్టీ, రిజిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్ అనుమతులు వంటి అంశాలపై కమిటీ పూర్తి స్థాయిలో చర్చించింది.
హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు 20 పడకలలోపు ఉన్న దవాఖాన్లను ఈ యాక్ట్ నుంచి సవరించాలని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. మరోవైపు.. ఆర్‌ఎంపీ, పీఎంపీ, నకిలీ వైద్యుల వ్యవస్థపై కఠినంగా ఉండాల్సిందేనని మెడికల్ కౌన్సిల్ ఈ సమావేశంలో ప్రస్తావించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రణాళికలు, మందుల పంపిణీకి ఎస్‌ఓపీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
