
- నిర్దేశిత టైంలో నోటిఫికేషన్ ఇస్తామని కేసీఆర్‌కు లేఖ
- నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ
- మధ్యాహ్నం 1.20కి ముహూర్తం
- పార్టీ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ భార్ గురువారం టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ కాపీలను తెలంగాణ, ఏపీ సీఈవోలకు పంపారు. పార్టీ పేరు మారుస్తూ నిర్దేశిత సమయంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో వెల్లడించారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అక్టోబర్ 5న పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు.
ఆరో తేదీన ఈ తీర్మానంతో పాటు సీఈసీకి కేసీఆర్ రాసిన లేఖను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబర్ 7న పబ్లిక్ నోటీస్ జారీ అయింది. ఆ గడువు ఈ నెల 7న ముగియడంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చొద్దని కోరుతూ ఒక అభ్యంతరం వచ్చినా దానిని సీఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. సీఈసీ రాసిన లేఖకు కేసీఆర్ రిప్లయ్ ఇస్తూ.. మరో లేఖ పంపిస్తారని, ఆ తర్వాత పార్టీ పేరు మారుస్తూ సీఈసీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంటరీ పార్టీ, ఎల్‌పీ పేరు మార్పు అప్పుడే
టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అధికారికంగా పేరు మార్పు కోసం ఇంకా కొంత ప్రక్రియ మిగిలి ఉంది. సీఈసీ రాసిన లేఖను ఎక్నాలెడ్జ్ చేస్తూ మళ్లీ లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖ అందిన తర్వాత పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత తెలంగాణ సీఈవో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ నోటిఫై చేస్తారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ (లోక్‌సభ, రాజ్యసభ), లెజిస్లేటివ్ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తారు. ఆ నోటిఫికేషన్ లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ సెక్రటరీలు అడాప్ట్ చేస్తూ బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభపక్షం పేర్లు బీఆర్‌ఎస్‌గా మారిపోతాయి.
నేడు ఆవిర్భావ సభ
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. దీనికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా పరిషత్, కార్పొరేషన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, పార్టీ ముఖ్య నాయకులంతా రావాలని కేసీఆర్ సూచించారు. సీఈసీకి సమాధానమిస్తూ రాసే లేఖపై మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ సంతకం చేస్తారు. అనంతరం ఆ లేఖను సీఈసీకి పంపిస్తారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ జెండా, పతాకం ఆవిష్కరిస్తారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పోషించబోయే భూమిక, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ప్రసంగిస్తారు.
త్వరలోనే మహారాష్ట్రలో రైతు సమావేశం
బీఆర్‌ఎస్‌కు సీఈసీ ఓకే చెప్పడంతో మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా రైతులను సమీకరించి డిసెంబర్లోనే భారీ మీటింగ్ పెట్టే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే ఈ మీటింగ్‌కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జాతీయ రైతు సంఘాల ప్రతినిధులు చేస్తున్నారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటక నుంచే బీఆర్‌ఎస్ ప్రస్తానం ప్రారంభించాలని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలుండటంతో ఆ రాష్ట్రంలోనూ జనవరిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. జేడీఎస్‌తో కలిసి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఏడాదిలో ఢిల్లీ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లోకి తాను ఎందుకు వస్తున్నది కేసీఆర్ ప్రకటించనున్నారు. శుక్రవారం జరిగే మీటింగ్‌లో పార్టీ జెండా, ఎజెండాపై స్పష్టత ఇవ్వనున్న కేసీఆర్.. ఏ రాష్ట్రంలో ఏ వ్యూహంతో బీఆర్‌ఎస్ వెళ్తుందనే దానిపైనా ప్రకటన చేసే అవకాశముంది.