మోదీ, అమిత్ షా స్థాయిలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ భద్రత పెంపు

మోదీ, అమిత్ షా స్థాయిలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ భద్రత పెంపు

SIRలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలో.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భద్రతను పెంచారు. ఢిల్లీలోని న్యూ మోతీ బాగ్ కాలనీలోని ఆయన ఇంటి బయట, ఎన్నికల కమిషన్ కార్యాలయం దగ్గర భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆయన వ్యక్తిగత భద్రత కోసం అదనపు సిబ్బందిని కూడా మోహరించారు.

ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు అందించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రత తర్వాత దేశంలో రెండవ అత్యున్నత భద్రతా కేటగిరీ అయిన జెడ్+ భద్రత జ్ఞానేష్ కుమార్‌కు ఇప్పటికే ఉంది. ఆయన ప్రస్తుత భద్రతా కేటగిరీలో మార్పు కాకుండా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనపు సిబ్బందిని మోహరించారు.

జెడ్-ప్లస్ సెక్యూరిటీలో భాగంగా.. సుమారు 50 మంది సిబ్బంది మూడు షిఫ్టులలో పని చేస్తారు. ఢిల్లీ, ఆగ్రాలోని సీఈసీ ఇళ్ల దగ్గర నిరసనకారులు ఆందోళన చేసిన తర్వాత జ్ఞానేష్ కుమార్ భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశ రాజధాని ఢిల్లీ ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తిన సంగతి తెలిసిందే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)ని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌‌‌‌తో బైఠాయించిన ప్రతిపక్ష నేతలు.. అకస్మాత్తుగా జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. దీంతో ముందస్తు అనుమతి లేదంటూ జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌కు కిలోమీటర్‌‌‌‌‌‌‌‌ దూరంలోనే వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.