హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుంటే.. తాము ఆర్థికంగా నష్టం పోతామని కొందరు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గ్రాట్యుటీపై సీలింగ్ ఎత్తేయాలని సుమారు 400 మంది అధికారులు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది కార్మికుల జీతాలు పెరుగుతుంటే.. తమ సాలరీ మాత్రం తగ్గనుందని అంటున్నారు. ఆర్టీసీలో ఎండీ తర్వాత స్థాయిలో ఉండే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఐదుగురు ఉన్నారు. వీరి జీతం, అలవెన్సులు కలిపి నెలకు రూ.3లక్షలు. ఎండీ కంటే ఎక్కువగా, సీఎస్ జీతంతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా బోర్డులో ప్రతిపాదించి కొన్నేండ్ల కింద ఈడీలు తమ జీతాలను భారీగా పెంచుకున్నారు. వీరి జీతాలపై ఆర్టీసీ కార్మికుల్లో అప్పుడు తీవ్ర చర్చ జరిగింది. విలీనం తర్వాత వీళ్లకు ప్రభుత్వం పే స్కేల్ మాత్రమే అందుతుంది. దీంతో సుమారు లక్ష జీతం తగ్గే అవకాశం ఉంది.
విలీనం తర్వాత తగ్గనున్న గ్రాట్యుటీ
గ్రాట్యుటీ విషయంలోనూ నష్టపోతామని అధికారులు అంటున్నారు. విలీనం తర్వాత ఈడీ స్థాయి అధికారి రిటైర్ అయితే రూ.16 లక్షల గ్రాట్యుటీ మాత్రమే వస్తుంది. అదే ఇప్పుడు రిటైర్ అయితే రూ.50 లక్షలకు పైగా వస్తుందని చెబుతున్నారు. రెండు నెలల కింద రిటైర్ అయిన ఓ అధికారి గ్రాట్యుటీ రూపంలో రూ.50లక్షల వరకు అందుకున్నాడు. విలీనం తర్వాత వచ్చే ఏడాది రిటైర్ అవుతున్న ఓ అధికారి మాత్రం రూ.16లక్షలు అందుకోనున్నాడు. దీంతో అతను త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటానని అంటున్నాడు. ఏడాది తర్వాత అయితే జీతం కంటే ఎక్కువ నష్టపోతానని భావిస్తున్నాడు. ఏపీలో ఆర్టీసీ విలీనం అయినప్పటి నుంచి గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. ఇటీవల ప్రభుత్వం దీనికి అంగీకరించింది. తెలంగాణలో కూడా ముందే సీలింగ్ ఎత్తేసేలా ప్రభుత్వంపై అధికారులు ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని బస్‌భవన్‌లో చర్చ జరుగుతున్నది.
ప్రతి పైసాకు లెక్క.. దొంగ బిల్లులకు చెక్
ఆర్టీసీకి నష్టాలు, అప్పులు ఉన్నా.. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. డీజిల్, స్క్రాప్, కొత్త బస్సుల కొనుగోళ్లు, వాటి బాడీ తయారీ, అద్దె బస్సుల రెంట్, వాటి బిల్లుల విడుదల, టిమ్ మెషిన్లు, షాప్ కిరాయిలు, కాంట్రాక్, ఔట్ సోర్సింగ్ ఇలా ప్రతీ డిపార్ట్మెంట్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు ఆరోపిస్తున్నారు. విలీనం అయితే ఇవన్నీ బంద్ అవుతాయి. ప్రతీ పైసాకు ప్రభుత్వం లెక్క అడుగుతుంది. ప్రతీ అంశాన్ని పరిశీలిస్తుంది. నిధుల విడుదల బాధ్యత ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ నుంచే లావాదేవీలు జరుగుతాయి. బిల్లుల క్రాస్ చెకింగ్, ఆడిటింగ్, కాగ్ ఇలా ఎన్నో దశల్లో ఎంక్వైరీలు జరుగుతాయి. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ 2021, ఆగస్ట్ 25న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆర్టీసీలో సంస్కరణలు జరుగుతున్నాయి. ఖర్చులతో పాటు నష్టాలు తగ్గిస్తున్నారు. సజ్జనార్ రాకముందు వివిధ అలవెన్సుల రూపంలో అధికారులు లక్షలు తీసుకునేవారు. ఆయన వచ్చాక అన్నింటిని రద్దు చేశారు.