ఫిఫా వరల్డ్ కప్లో ఓడిన ఇరాన్..సంబరాలు చేసుకున్న ఆ దేశ ప్రజలు

ఫిఫా వరల్డ్ కప్లో ఓడిన ఇరాన్..సంబరాలు చేసుకున్న ఆ దేశ ప్రజలు

ఫిఫా వరల్డ్ కప్లో తమ జట్టు ఓడిపోతే ఆ దేశానికి చెందిన ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఇరాన్ జట్టు ఓడిపోయింది. అయితే ఆ దేశంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్ లో జనం సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఈ సీజన్ లో తమ జట్టు ఫిఫా వరల్డ్ కప్లో ఆడడం ఇరాన్ ప్రజలకు ఇష్టం లేదు. దేశంలో యాంటీ హిజబ్ ఆందోళనలు జరుగుతుంటే ఫుట్ బాల్ టీం ఖతార్ వెళ్లడం అవసరమా అనేది అక్కడి ప్రజల అభిప్రాయం. ప్రజల ఆందోళనలకు మద్దతుగా ఫిఫా వరల్డ్ కప్ పోటీలను బహిష్కరించాలని ఇరాన్ ప్రజలు కోరుకున్నారు. కానీ ఫుట్ బాల్ టీం మాత్రం ఖతార్ వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో ఓడిపోగానే ఆ దేశవాసులు సంబరాలు చేసుకున్నారు. 

ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహసా అమినీ మరణం తర్వాత చెలరేగిన నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బ్రిగేడియర్ జనరల్ అమిరాలి హజిజాదే ప్రకటించారు. ఆమె మరణం దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, సైనికులు, మిలిషియా సభ్యులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.