
- సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించిన ఆదివాసీలు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెండాల ఆవిష్కరణ
- ఊరూరా కుమ్రం భీంకు ఘన నివాళి
- కోయ భాష గుర్తింపునకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో వెల్లడి
- వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు
వెలుగు నెట్వర్క్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివాసీల జెండాలను ఆయా గ్రామాల్లో ఆవిష్కరించారు. మండలకేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కుమ్రంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భద్రాచలంలో కోయ, నాయకపోడు సంప్రదాయ నృత్యాలు, డప్పులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన వేడుకలకు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ బాబూరావు పాల్గొన్నారు. చర్ల మండలం సున్నంగుంపునకు చెందిన ముత్యాలమ్మ జాయింట్ లయాబిలిటీ గ్రూప్ మహిళలు చిరుధాన్యాలతో తయారు చేసిన ఇప్ప పువ్వు బర్ఫీ, ఇప్ప పువ్వు చాక్లెట్, ఇప్ప పువ్వులడ్డూల బుక్‌ను ఆవిష్కరించారు. ఐటీడీఏ ద్వారా విద్యాభివృద్ధికి, కోయ భాష గుర్తింపునకు కృషి చేస్తున్నట్లు పీవో రాహుల్ తెలిపారు.
అనంతరం వివిధ రంగాల్లో రాణించిన పలువురు ఆదివాసీలను ఘనంగా సత్కరించారు. ఖమ్మం సిటీలోని గిరిజన భనంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి అధ్యక్షతన వేడుకలు నిర్వహించగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఆదివాసీల సంక్షేమానికి పోలీస్ శాఖ కృషి
భద్రాద్రి కొత్తగూడెం: ఆదివాసీల సంక్షేమానికి పోలీస్ శాఖ, ప్రభుత్వం కృషి చేస్తోందని ఎస్పీ బి.రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలో ఆదివాసీలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్లో పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సన్మానించారు. ఆదివాసీల కోసం చర్ల మండలంలో రూ.2 కోట్లతో రెండు మొబైల్ హాస్పిటల్స్, దుమ్ముగూడెంలో రూ.2 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించినట్లు తెలిపారు.
పోరాటాలతోనే ఆదివాసీల హక్కుల పరిరక్షణ
కారేపల్లి, వెలుగు: పోరాడి సాధించుకున్న ఆదివాసీల హక్కులు అణచివేతకు గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం కాలేపల్లిలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ పోరాటాలతోనే సాధ్యమన్నారు.
కుమ్రంభీం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
-
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ, వెలుగు: కుమ్రంభీం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాత సూరారంలో కుమ్రంభీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఉన్నారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ చంద్రాలగూడెంలో ఆదివాసి యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు.