ప్రపంచమంతా యోగా మంత్ర

ప్రపంచమంతా యోగా మంత్ర
  • ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి విషెస్
  • యుద్ధనౌకపై రాజ్​నాథ్ యోగా
  • కేరళలో నీళ్ల​లో జవాన్ల ఆసనాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆకాశమే హద్దుగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు. సూరత్‌‌‌‌లో జరిగిన యోగా డే ప్రోగ్రామ్​లో 1.53 లక్షల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. ముంబైలో నేవీ సిబ్బంది ఐఎన్ఎస్ విక్రాంత్​పై యోగా చేశారు. అటు ఆర్మీ జవాన్లు కూడా లడఖ్​లోని మంచు కొండల్లో ఆసనాలు వేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంలు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత ప్రజలకు బుధవారం ఉదయం ఒక వీడియో సందేశాన్ని పంపించారు. మానవ సంబంధాలను మెరుగుపరిచి.. ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియానే అని మోదీ గుర్తు చేశారు. ‘‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్” స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రపతి భవన్​లో ద్రౌపది ముర్ము యోగా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందరికీ యోగా డే విషెస్ చెప్పారు. యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని, ఈ ప్రపంచానికి ఇండియా అందించిన విలువైన బహుమతుల్లో ఒకటని ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. తర్వాత రాష్ట్రపతి భవన్​లో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ జబల్​పూర్​ సిటీలోని గార్రిసన్​ గ్రౌండ్​లో నిర్వహించిన యోగా ప్రోగ్రామ్​కు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​కర్ అటెండ్ అయ్యారు. యోగా డే ఒక యూనివర్సల్ ఫెస్టివల్ అని తెలిపారు. ‘వసుధైక కుటుంబం’ అనేది ఈ ఏడాది యోగా డే థీమ్ అని వివరించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, హర్దీప్​సింగ్ పురి, మాన్సుఖ్ మాండవీయ, పీయూష్​ గోయల్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, తదితరులు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. పణజిలో జరుగుతున్న జీ20 టూరిజం మినిస్టీరియల్ మీటింగ్​లో భాగంగా రాజ్​భవన్​లో ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, సౌత్ కొరియా దేశాల ప్రతినిధులు యోగా చేశారు. యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్​డబ్ల్యూటీవో) సెక్రటరీ జనరల్ జురబ్ పొలోషికాష్విలి కూడా పాల్గొన్నారు. టూరిజం కోసం మోదీ చేస్తున్న కృషిని అభినందించారు.  

భోపాల్ – ఢిల్లీ వందేభారత్​లో ప్రాణాయామం

ఇండియన్ ఆర్మీ, వివిధ బెటాలియన్ల సైనికులు సిక్కిం, లడఖ్​లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. భోపాల్​ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్​ప్రెస్​లోనూ యోగా దినోత్సవం నిర్వహించారు. కొందరు ప్రయాణికులు ఆసనాలు వేస్తే.. మరికొందరు సీట్లలోనే కూర్చొని ప్రాణాయామం చేశారు. పాంగోడ్ మిలిటరీ స్టేషన్‌‌‌‌లోని ఇండియన్ ఆర్మీ కేరళలో నీటి అడుగున యోగా సెషన్‌‌‌‌ను నిర్వహించింది. ముంబైలోని ఇండియా గేట్, ఆగ్రాలోని తాజ్​మహల్, ఢిల్లీలోని పార్లమెంట్, పురానా ఖిల్లాల వద్ద నిర్వహించిన యోగా డే వేడుకల్లో వందలాది మంది పాల్గొని ఆసనాలు వేశారు. యోగా మానవాళి సంక్షేమానికి ఇండియా ఇచ్చిన బహుమతి అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహంత్ దిగ్విజయ్​నాథ్ స్మృతి సభాగర్​లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.

యోగాకు కాపీరైట్స్ లేవు

యూఎన్​ హెడ్​క్వార్టర్స్​లో మోదీ

న్యూయార్క్: యోగా.. ఇండియాలో ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ అని, యోగాకు ఎలాంటి పేటెంట్‌‌‌‌, కాపీరైట్ హక్కులు అక్కర్లేదని ప్రధాని మోదీ అన్నారు. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానమే యోగా అని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌‌‌‌లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకలకు మోదీ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత వివిధ దేశాల ప్రతినిధులు, భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘యోగా అంటే ఏకత్వం. ఇక్కడ ప్రతి దేశ జాతీయత ప్రతిబింబిస్తున్నది. యోగా అనేది ఇండియా పురాతన సంప్రదాయం. దీనికి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీ పేమెంట్లు ఏమీ ఉండవు. ఫిట్‌‌‌‌నెస్ పరంగా ఏ వయసుకైనా, ఎవరికైనా యోగా ఎంతో మేలు చేస్తుంది” అని మోదీ అన్నారు.

ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

యోగా దినోత్సవం మనందరినీ మరింత దగ్గర చేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మోదీ అన్నారు. 2023ని ‘అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌‌‌‌’గా జరుపుకోవాలన్న ఇండియా ప్రతిపాదనకు గతేడాది ప్రపంచం మొత్తం కలిసి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.  యూఎన్​ యోగా దినోత్సవంలో 180కి పైగా దేశాలకు చెందిన కళాకారులు, విద్యావేత్తలు, డిప్లొమాట్స్, ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్స్, హెల్త్, ఐటీ ఎక్స్​పర్ట్స్, ఇండస్ట్రియలిస్ట్​లు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.

సూరత్​లో గిన్నిస్ రికార్డు

సూరత్​లో జరిగిన యోగా డే వేడుక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​లో స్థానం సంపాదించుకుంది. ఒకేచోట 1.53 లక్షల మంది యోగా చేశారు. 2018, రాజస్థాన్​లోని కోట సిటీలో జరిగిన యోగా దినోత్సవంలో 1,00,984 మంది పాల్గొన్నారు. ఈ రికార్డును సూరత్ బ్రేక్ చేసింది. డుమాస్ ఏరియాలో జరిగిన యోగా డే వేడుకల్లో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. 1.25లక్షల మంది అటెండ్ అవుతారని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

2.20లక్షల మంది ఆన్​లైన్​లో రిజిస్టర్ చేసుకుంటే.. 1.53లక్షల మంది పాల్గొన్నారు. ఎంట్రీ పాయింట్ వద్ద క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేసి రిస్ట్ బ్యాండ్ పెట్టి లోపలికి పంపించారు. 10.50 కి.మీ పొడవైన రెండు రోడ్లపై యోగా చేశారు. 135 బ్లాకులు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్​లో 1000 మంది చొప్పున పాల్గొన్నారు. గుజరాత్ వ్యాప్తంగా 72వేల వేదికలపై 1.25 కోట్ల మంది యోగా చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు సీఎం భూపేంద్ర పటేల్​కు సర్టిఫికెట్​ను అందజేశారు.