సిమెంట్​కు అండ సర్కారే : మహేంద్ర సింఘి

సిమెంట్​కు అండ సర్కారే : మహేంద్ర సింఘి

హైదరాబాద్‌‌, వెలుగు :ఇండియాలోని సిమెంట్‌‌ కంపెనీలు కొత్తగా వచ్చే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయని నేషనల్‌‌ కౌన్సిల్‌‌ ఫర్‌‌ సిమెంట్‌‌ అండ్‌‌ బిల్డింగ్స్‌‌ డైరెక్టర్‌‌ జనరల్‌‌ మహాపాత్ర చెప్పారు. చాలా సిమెంట్‌‌ ప్లాంట్స్‌‌ సోలార్‌‌ పవర్ ప్లాంట్స్‌‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపారు. కొన్ని ఇండస్ట్రీస్‌‌ నుంచి వచ్చే వేస్టేజ్‌‌ను సిమెంట్‌‌ ఉత్పత్తిలో వాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా సిమెంట్‌‌ ఇండస్ట్రీ ప్రయత్నిస్తోందని చెప్పారు. సీఎంఏ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్‌‌ సిమెంట్‌‌ టెక్ కాన్‌‌ఫరెన్స్‌‌లో మహాపాత్ర పాల్గొన్నారు.సిమెంట్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ (సీఎంఏ) ఆధ్వర్యంలో హెచ్‌‌ఐసీసీలో రెండు రోజులపాటు సాగే గ్రీన్‌‌ సిమెంట్‌‌ టెక్‌‌ కాన్ఫరెన్స్‌‌ గురువారం మొదలైంది. దేశంలోని ప్రముఖ సిమెంట్‌‌ కంపెనీల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొంటున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా సిమెంట్‌‌ పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కాన్ఫరెన్స్‌‌లో చర్చిస్తున్నారు.

ప్రపంచంలోనే రెండో పెద్ద సిమెంట్ తయారీదారుగా ఇండియా నిలుస్తోందని గ్రీన్‌‌ సిమెంట్‌‌ టెక్‌‌ ఛైర్మన్‌‌ ఫిలిప్‌‌ మాథ్యూ చెప్పారు. ఏటా 500 మిలియన్‌‌ టన్నుల సిమెంట్‌‌ను ఇండియా తయారు చేస్తోందన్నారు. సిమెంట్‌‌ ప్రొడక్షన్‌‌లో కొత్త టెక్నాలజీ వినియోగం ద్వారా కార్బన్‌‌ డయాక్సైడ్‌‌ను తగ్గిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు చేపడుతున్న ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, స్మార్ట్‌‌ సిటీ డెవలప్‌‌మెంట్‌‌ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల సిమెంట్‌‌ వినియోగం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు.  ఇండియా ఎకానమీ అభివృద్ధిలో సిమెంట్‌‌ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తోందని సిమెంట్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ అసోసియేసన్‌‌ ప్రెసిడెంట్ మహేంద్ర సింఘి అన్నారు. ఎంతో మందికి సిమెంట్‌‌ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. జీఎస్‌‌టీలో 28 శాతం శ్లాబులోనే ఇంకా కొనసాగిస్తుండటంతో సిమెంట్‌‌ రంగం సమస్యలు ఎదుర్కొంటోందన్నారు.

దీంతోపాటు ఇతర సవాళ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు వల్లే సిమెంట్‌‌కు డిమాండ్‌‌ బాగా పెరుగుతోందని మహేంద్ర సింఘి వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌‌లో భాగంగా వివిధ సిమెంట్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ కంపెనీలతోపాటు, సిమెంట్‌‌ టెక్నాలజీ కంపెనీలు తమ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిమెంట్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌లో పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్న సిమెంట్‌‌ కంపెనీలకు గ్రీన్‌‌ ప్రోఅవార్డులను కూడా ఈ కాన్ఫరెన్స్‌‌లో అందచేశారు.