2027 జనాభా లెక్కలపై బిగ్ అప్డేట్.. జనగణన తేదీలు ప్రకటించిన కేంద్రం..!

2027 జనాభా లెక్కలపై బిగ్ అప్డేట్.. జనగణన తేదీలు ప్రకటించిన కేంద్రం..!

న్యూఢిల్లీ: 2027 జన గణన వివరాలను కేంద్ర ప్రభ్వుతం వెల్లడించింది. 2027 జనాభా లెక్కింపు మొత్తం రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలిదశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. జనాభా లెక్కింపులో కుల గణన కూడా నిర్వహించున్నట్లు తెలిపింది. 2027 జనాభా లెక్కింపును డిజిటల్ పద్దతిలో నిర్వహిస్తామని.. స్వీయ గణన కోసం ఆన్‌లైన్ సదుపాయం కూడా కల్పిస్తామని వెల్లడించింది. 

శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన గణన ప్రక్రియకు సంబంధించిన వివరాల గురించి సభలో ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. 2027 జనగణన మొత్తం రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 2026, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఫస్ట్ ఫేజ్, 2027 ఫిబ్రవరిలో సెకండ్ ఫేజ్ పాపులేషన్ సెన్సస్ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. 

తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన.. రెండో దశలో- జనాభా గణన (PE) నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ప్రక్రియకు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, జనాభా లెక్కల డేటా వినియోగదారుల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌లు, సూచనల ఆధారంగా జనాభా లెక్కల ప్రశ్నాపత్రాన్ని ఖరారు చేస్తారని పేర్కొన్నారు. జనాభా గణనకు 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని గుర్తు చేశారు. 

తదుపరి జనాభా గణనను నిర్వహించడానికి మునుపటి వ్యాయామాల నుంచి నేర్చుకున్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. జనాభా లెక్కింపులో కుల గణన కూడా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. 2027 జనాభా లెక్కింపును డిజిటల్ పద్దతిలో నిర్వహిస్తామన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా డేటాను సేకరిస్తామని అలాగే.. స్వీయ గణన కోసం ఆన్‌లైన్ సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. 

దేశంలో డిజిటల్ సెన్సస్ నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. అలాగే జనాభా లెక్కల్లో కులాల సమాచారం సేకరించడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. ఫేజ్ 1లో హౌస్ లిస్టింగ్ లో భాగంగా ప్రతి కుటుంబానికి చెందిన ఇండ్ల కండీషన్, ఆస్తులు, సౌలతుల వివరాలు నమోదు చేస్తారు. ఫేజ్2లో జనాభా లెక్కింపులో భాగంగా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, స్థితిగతులు, ఇతర వివరాలను ఎంట్రీ చేస్తారు.

జనగణన ఖర్చు ఎంత..?

జనగణన కోసం 34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌‌‌‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. 2025–26 బడ్జెట్‌‌‌‌లో జనగణన కోసం రూ.574.80 కోట్లు కేటాయించారు. అయితే, మొత్తం ఖర్చు రూ.13,000 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1,800 మంది మాస్టర్ ట్రైనర్లు.. 45వేల మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణనపై శిక్షణ ఇస్తారు. 

వీళ్లు ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జనగణన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం.. ఏడో షెడ్యూల్​లోని కేంద్ర జాబితాలో 69వ అంశంగా జాబితా చేశారు. కుల గణన చేపట్టడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి. చివరి సమగ్ర కుల ఆధారిత లెక్కింపు.. 1881, 1931 మధ్య జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా కులాల వారీగా లెక్కలు తీయలేదు.