
- మోదీ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నాం
- సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు: దేశంలోని కార్మికవర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బుధవారం దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. మంగళవారం సింగరేణి ఆర్జీ –1 ఏరియాలోని జీడీకే 2ఏ ఇంక్లైన్, ఏరియా వర్క్ షాప్‌లో జరిగిన గేట్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులపై మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జేఏసీ సంఘాల లీడర్లు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కె.సదానందం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, టీబీజీకెఎస్రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్మాట్లాడారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కె.స్వామి, ఆరెల్లి పోశం, మెండె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.