- ఆరు ఆబ్జెక్టివ్స్తో ప్రణాళికను విడుదల చేసిన కేంద్రం
- యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించే చర్యలు
- గ్రామస్థాయి నుంచే అవగాహన కల్పించేలా కార్యక్రమాలు
- పిల్లలకు యాంటీబయాటిక్స్, ఏఎంఆర్‌పై పాఠాలు
- యాంటీబయాటిక్స్ అమ్మకాలపై కఠినమైన నియంత్రణ
హైదరాబాద్, వెలుగు: విచ్చలవిడిగా పెరిగిపోతున్న యాంటీబయాటిక్స్ వినియోగం, తీవ్రంమవుతున్న యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. గతంలోనే నేషనల్ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించినా.. దాని నుంచి సరైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా ‘వన్ హెల్త్’ పాలసీ కింద ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎన్ఏపీ ఏఎంఆర్) 2.0’ను తీసుకొచ్చింది. 2025–2029 వరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆరు ఆబ్జెక్టివ్స్తో ప్రణాళికను విడుదల చేసింది. నీతి ఆయోగ్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఈ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నారు. యాంటీబయాటిక్స్‌తో కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
ఏఎంఆర్‌ను గుర్తించేలా, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రస్థాయిల్లో ఏఎంఆర్ సెల్‌ను ఏర్పాటు చేసి.. దానికి ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించనున్నారు. యాంటీబయాటిక్స్‌తో పాటు షెడ్యూల్ హెచ్, హెచ్1 ఔషధాల అమ్మకాలపై కఠినమైన నియంత్రణను విధించనున్నారు.
ఈ విషయంలో అన్ని ప్రభుత్వ విభాగాలనూ కేంద్రం భాగస్వాములుగా చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, మత్స్యపాడి పశుసంవర్థక శాఖ, వ్యవసాయ శాఖ, పర్యావరణ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమికల్ ఫర్టిలైజర్, ఆయుష్, జలశక్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్, విద్యా శాఖలు ఇందులో భాగస్వాములుగా ఉండనున్నాయి. యాక్షన్ ప్లాన్ పురోగతిపై ప్రతి ఆరు నెలలకోసారి ఆయా శాఖలన్నీ సమావేశాలను నిర్వహించనున్నారు.
అవగాహన కార్యక్రమాలు..
చాలా మంది అవగాహన లేక యాంటీబయాటిక్స్‌ను వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఎంఆర్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటి.. దానిని ఎలా ఆపాలి అన్న విషయాలపై గ్రామ స్థాయి నుంచే అవగాహన కల్పించే కార్యక్రమాలకు కేంద్రం రూపకల్పన చేయనుంది. ఇందులో భాగంగా యాంటీబయాటిక్స్, ఏఎంఆర్‌పై ఉన్న అవగాహన, వైఖరి, ప్రాక్టీస్‌పై కేఏపీ స్టడీస్ చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసి.. ప్రజలకు దీనిపై వివరించనున్నారు.
ప్రొఫెషనల్ విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, హెల్త్, వెటర్నరీ రంగాల్లో.. ఏఎంఆర్‌ను కోర్ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టి అవగాహన కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా.. స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు సిలబస్‌లో యాంటీబయాటిక్స్ వాడకం, ఏఎంఆర్లను పాఠాలుగా చేర్చి అవగాహన కల్పించేలా ప్రయత్నం చేయనున్నారు.
ల్యాబ్‌ల కెపాసిటీ పెంపు
క్షేత్ర స్థాయిలోనే ఏఎంఆర్‌ను నియంత్రించేలా మైక్రోబయాలజీ ల్యాబ్ ల సామర్థ్యాన్ని పెంచాలని యాక్షన్ ప్లాన్‌లో కేంద్రం పేర్కొంది. దానికితగ్గట్టుగా యాంటీ మైక్రోబియల్స్ను అవసరానికి తగ్గట్టు వాడేలా చూడనుంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌ను పటిష్ఠం చేయనుంది. యాంటీ మైక్రోబియల్స్ను రాసే ముందు.. వాటి అవసరం నిర్ధారించేందుకు టెస్టులను చేసేలా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఏఎంఆర్‌పై ఓ కన్నేసి ఉంచేందుకు హాస్పిటళ్లు, ల్యాబుల్లో డిజిటల్ డాక్యుమెంటేషన్‌ను చేసేలా.. హాస్పిటల్/ల్యాబ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్/ఎల్ఐఎంఎస్)ను నెలకొల్పనున్నారు. ఇక, పెట్స్, కోళ్లు, చేపలు ఇతర ఆహార వనరుల్లో యాంటీబయాటిక్స్ వినియోగం, ఏఎంఆర్పైనా నిఘాను పటిష్టపరచనున్నారు. వీటిలో యాంటీబయాటిక్స్ అవశేషాలను గుర్తించేలా కొత్త ల్యాబులను ఏర్పాటు చేయాలని యాక్షన్ ప్లాన్‌లో పేర్కొన్నారు.
ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకట్ట..
యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేందుకు ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణే (ఐపీసీ– ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయనుంది. అందుకోసం ఐపీసీ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయనుంది. అనంతరం పశువులు, చేపలు, కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టనుంది.
పశువుల్లో యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడుతుండడం వల్ల.. ఏఎంఆర్ జీన్స్ పర్యావరణంలో కలుస్తున్నాయి. దాని వల్ల కూడా ఏఎంఆర్ తీవ్రత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో దాన్ని నివారించేందుకు బయోమెడికల్ వేస్టేజ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని యాక్షన్ ప్లాన్‌లో నిర్ణయించింది. డేట్ దాటిపోయిన యాంటీబయాటిక్స్ మందులను సురక్షితమైన పద్ధతుల్లో డిస్పోజ్ చేసే మెకానిజాన్ని అమలు చేయాలంది.
యాంటీబయాటిక్స్ వాడకం తగ్గించేలా చర్యలు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మంది షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ తెచ్చేసుకుంటున్నారు. సర్ది అయినా.. దగ్గొచ్చినా వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాంటీబయాటిక్స్ విచ్చలవిడి అమ్మకాలు, వాడకాన్ని తగ్గించే చర్యలు చేపట్టనుంది. షెడ్యూల్ హెచ్, హెచ్1 మందుల అమ్మకాలపై కఠినమైన నియంత్రణను విధించాలి.
యాంటీబయాటిక్స్‌ను వాడాల్సి వస్తే ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్‌ను పాటించాలి. సాధారణ ఇన్ఫెక్షన్లకూ యాంటీబయాటిక్స్ వాడకుండా నేషనల్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయాలి. యాంటీబయాటిక్స్‌ను సరైన రీతిలో వినియోగించేలా ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేయాలి. యాంటీబయాటిక్స్ వాడకంపై జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
ఏఎంఆర్ నిరోధానికి పటిష్టమైన విధానాలు
చాలా సెక్టార్లలో ఏఎంఆర్ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఏఎంఆర్‌ను నిరోధించేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లోనూ పాలనాపరమైన వ్యవస్థలను బలోపేతం చేయాలి. అన్ని శాఖలూ కలిసి ఏఎంఆర్‌ను నిరోధించేందుకు ప్రయత్నాలు చేయాలి.
రాష్ట్రస్థాయిలో ఏఎంఆర్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. దానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. నేషనల్ యాక్షన్ ప్లాన్‌కూ అనుగుణంగా రాష్ట్రాలు యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలి. ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్‌ను మానిటరింగ్ చేసేందుకు రాష్ట్రాలూ ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కేంద్రం ప్రవేశపెట్టిన ఆరు లక్ష్యాలు..
1. ప్రజలకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై అవగాహన కల్పించాలి.
2. ఏఎంఆర్‌ను గుర్తించి నిరోధించేందుకు లేబొరేటరీల సామర్థ్యాన్ని పటిష్టపరచాలి.
3. సమర్థవంతమైన నివారణ, నియంత్రణ చర్యల ద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గించాలి.
4. మనుషులు, జంతువులు, చేపలకు యాంటీ బయాటిక్స్ విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించాలి.
5. ఏఎంఆర్‌పై సమగ్రమైన పరిశోధనలకు ప్రోత్సాహం.
6. ఏఎంఆర్‌ను తగ్గించేందుకు గవర్నెన్స్, కోఆర్డినేషన్, కొలాబరేషన్‌ను మరింత పటిష్టం చేయాలి.
వీటిని సబ్క్లాజ్లుగా విభజించి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఏ శాఖకు ఆ శాఖ ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్‌లో స్పష్టం చేసింది.
రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ ప్రమోషన్
అన్ని రంగాల్లోనూ ఏఎంఆర్‌పై రీసెర్చ్ చేసే పాలసీకి రూపకల్పన చేయాలి. ఏఎంఆర్ వల్ల కలిగే హాని, నష్టాలు, ఆర్థిక భారం వంటి వాటిపై పరిశోధనలు చేయాలి. తక్కువ ఖర్చులోనే టెస్టులు, చికిత్స అయిపోయే మార్గాలపై అన్వేషించాలి. ఏఎంఆర్‌పై పోరాడేందుకు ఇండియా ఏఎంఆర్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలి.
ఏఎంఆర్ వల్ల సంభవిస్తున్న మరణాలు, ఆర్థిక భారంపై విశ్లేషనాత్మక స్టడీలు చేయాలి. మనం తీసుకునే ఆహారంలో (కోళ్లు, చేపలు, మాంసం, పాలు, కూరగాయలు సహా) ఏఎంఆర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ఫెసిలిటీలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే పైలట్ ప్రాతిపదికన రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేయాలి.
