ప్రభుత్వ సంస్థల ప్రైవేటైజేషన్​కు కేంద్రం కుట్ర

ప్రభుత్వ సంస్థల ప్రైవేటైజేషన్​కు కేంద్రం కుట్ర

ఆసిఫాబాద్/కాగజ్​నగర్/మందమర్రి/బెల్లంపల్లి/మంచిర్యాల, వెలుగు: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్​ చేసేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. సింగరేణి గనులనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు వేలం వేస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డలే అయితే సింగరేణి నాలుగు కోల్​బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే వాళ్లను  సింగరేణి ఏరియాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.  శుక్రవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో మంత్రి ఐకేరెడ్డితో కలిసి హరీశ్​రావు పాల్గొన్నారు. ఆదిలాబాద్​లో సీసీఐ రీ ఓపెన్​ కోసం జరుగుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.  బీజేపీ  నేతలకు దమ్ముంటే సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. మందమర్రి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.24.13 కోట్లతో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లిలో మిషన్ భగీరథ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీసును ప్రారంభించి, కొత్తగా  నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి సందర్శించారు. జేవీఆర్‌ఓసీ 3, కేకే 6, శ్రవణపల్లి ఓసీ, కోయగూడెం గనులను వేలం వేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు నిరసిస్తున్నారని, ఈ విషయంలో కేంద్రంతో  మాట్లాడేందుకు  రాష్ట్ర బీజేపీ నేతలు భయపడుతున్నారని, సింగరేణి మూత పడి.. కార్మికులు రోడ్డున పడాలన్నదే వారి ఉద్దేశమని ఫైర్​అయ్యారు. కార్మికుల ఇన్​కమ్​ట్యాక్స్​రద్దు కోసం రాష్ట్ర సర్కార్​అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఏడేండ్లలో రైల్వేలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, కేంద్రంలో సుమారు 3 లక్షల ఖాళీలున్నాయని చెప్పారు. తెలంగాణలో  1.32లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్​ఇస్తామన్నారు. 

ఆసిఫాబాద్​లో మెడికల్​ కాలేజీ..
ఆసిఫాబాద్​లో మెడికల్​ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని హరీశ్ రావు చెప్పారు. ఆసిఫాబాద్​లోని ఆంకుషాపూర్ లో రూ.60 కోట్లతో 340 బెడ్స్​హాస్పిటల్, రేడియాలజీ ల్యాబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్​మాట్లాడుతూ రూ. 50 కోట్లతో హాస్పిటల్ నిర్మించి, రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బడ్జెట్ లోనే ఫండ్స్​ ఇస్తామన్నారు. తండాలు, గోండు గూడాలకు రోడ్డు  సౌకర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ త్వరలోనే స్పెషల్​ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎస్టీ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.

అడవి నుంచి వెళ్లగొడ్తున్నరు..
ఫారెస్ట్​ ఆఫీసర్లు అడవుల్లోంచి తమను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎలాగైనా న్యాయం చేయాలని ఆదివాసులు మంత్రి హరీశ్​రావును వేడుకున్నారు. కాగజ్ నగర్  పర్యటనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం, ఫారెస్ట్​ఆఫీసర్ల తీరు వల్ల గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆదివాసీ గిరిజన నాయకులు బుర్శ పోచయ్య, మాంతయ్య, పార్పెల్లి పోషన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.