
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును " భారత్ రాష్ట్ర సమితి " (బీఆర్ఎస్ ) గా సవరించి, ఆమోదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అధికారికంగా లేఖ కూడా అందింది. దీంతో రేపు మధ్యాహ్నం 01:12 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ వేడుకలు వేదికగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని కేసీఆర్ కోరారు. అందరూ శుక్రవారం మధ్యాహ్నంలోగా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని ఆదేశించారు. కాగా, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలని కోరుతూ ఈ ఏడాది దసరా పర్వదినం రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖను రాసిన సంగతి తేలిసిందే.