- పోలీసు ఆఫీసర్లయినా.. ఆఖరికి సొంత పార్టీ నేతలైనా చర్యలు తప్పవు
- త్వరలోనే అందరి భరతం పడుతాం.. మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరిక
- ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని హామీ
- మంచిర్యాల జిల్లాలో పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: ఇసుక దందాపై ఉక్కుపాదం మోపుతామని, ఇసుక మాఫియాకు సహకరిస్తే పోలీస్ ఆఫీసర్లయినా.. ఆఖరికి సొంత పార్టీ నాయకులైనా చర్యలు తప్పవని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాదారులతో అంటకాగుతున్న పోలీసు ఆఫీసర్ల రిపోర్టు తెప్పించుకుంటున్నామని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అక్రమార్కుల భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు, జైపూర్, సోమగూడెంలో మంత్రి వివేక్ పర్యటించారు. మందమర్రి మున్సిపాలిటీలోని భగత్‌సింగ్‌నగర్ నుంచి శ్రీపతినగర్ వరకు రూ.12 లక్షల బీటీ రోడ్డు పనులకు, జైపూర్ మండల కేంద్రంలో రూ. 25 లక్షల నిధులతో నిర్మించే అంబేద్కర్కమ్యూనిటీ భవన పనులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు.
లబ్ధిదారులకు చెన్నూరు క్యాంపు ఆఫీస్‌లో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్గాంధీ చౌక్ నుంచి రావిచెట్టు వరకు రోడ్డు వెడల్పు అంశంపై స్థానిక వ్యాపారులతో మంత్రి వివేక్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇసుక దందా, మాఫియా అడ్డూఅదుపు లేకుండా కొనసాగిందని మండిపడ్డారు. ‘‘ఒక్కో వే బిల్లుతో పెద్దసంఖ్యలో లారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేసి వందల కోట్లు సంపాదించారు. ఆ డబ్బులను ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కాంగ్రెస్ మద్దతుదారులను ఓడించాలనే ప్రయత్నం చేశారు” అని ఫైర్ అయ్యారు. ‘‘ఇసుక మాఫియాకు కొందరు పోలీస్ఆఫీసర్లు సహకరించారు.. మాఫియాతో దోస్తీ కట్టిన ఆఫీసర్ల రిపోర్టు తెప్పించుకుంటున్నాను. త్వరలోనే అందరి భరతరం పడుతాం’’ అని ఆయన హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాతో పాటు అన్ని అక్రమ దందాలను బంద్పెట్టించానని చెప్పారు.
చెన్నూరులో గోదావరి ఇసుక సప్లై
త్వరలో చెన్నూరులో గోదావరి ఇసుకను సప్లై చేస్తామని, శాండ్బజార్లో ఇసుక ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదులు వస్తున్నందున దీనిని తగ్గించే ప్రయత్నం చేస్తామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ప్రజల కోసం రూ.2 వేలకు ట్రిప్పు ఇసుకను సప్లై చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ఇండ్ల లబ్దిదారులకు స్థోమత లేకపోతే పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో కలెక్టర్ ద్వారా ఒక ప్రత్యేక కాంట్రాక్టర్‌ను నియమించి ఇండ్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పట్టణాల్లో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, మొదటి విడతలో ఇండ్లు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కమ్యూనిటీ భవనాలకు నిధులు
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కుల సంఘాలన్నింటికీ అవసరమైన కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మందమర్రిలో అంబేద్కర్భవనం, జైపూర్‌లో బాబు జగ్జీవన్‌రామ్ భవనం, ఎస్టీ భవనం, చెన్నూరులో ముదిరాజ్భవనం, మున్నూరుకాపు భవనం నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరులో అంబేద్కర్ భవనం ప్రారంభించామని, జైపూర్‌లో రూ. 25 లక్షల ఫండ్స్‌తో పనులకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జైపూర్ మండలంలో మూసివేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోగల నర్సరీని తిరిగి ప్రారంభించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించి, మహిళలను ప్రోత్సహిత్సున్నామని, అవసరం ఉన్నచోట రూ. 20 లక్షల వ్యయంతో ఇందిరా మహిళా భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. చెన్నూరు పట్టణాభివృద్ధిలో భాగంగా గాంధీచౌక్ నుంచి రావిచెట్టు వరకు రోడ్డు వెడల్పుకు స్థానిక వ్యాపారులు సహకరించాలని మంత్రి వివేక్ కోరారు. షాపులు పూర్తిగా కోల్పోయే వారికి షాప్‌లు కట్టిస్తామని.. ఇతరులకు సర్కార్ నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు
చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో త్వరలో మరో రూ. 100 కోట్ల ఫండ్స్‌తో అభివృద్ది పనులు చేపట్టనున్నామని, ఇప్పటికే 70 శాతం సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలు పూర్తి చేశామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీకి రూ. 18 కోట్లు, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఆరునెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులతో అన్ని ప్రాంతాల్లో సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. మూడు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ. 100 కోట్ల ఫండ్స్‌తో అమృత్స్కీం పనులు నడుస్తున్నాయని, జులై నాటికి ఇంటింటికీ నల్ల ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. ‘‘గత బీఆర్ఎస్ పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. సీసీ రోడ్లు, డ్రైయినేజీల వంటి మౌళిక సదుపాయాల కల్పనపై నిర్లక్ష్యం చేశారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది” అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
