- వీరిలో కెనడాకే 4.5 లక్షల మంది
- ఆ తర్వాత స్థానాల్లో యూఎస్, యూకే, జర్మనీ
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళుతున్న యువత ఎక్కువగా కెనడాకే మొగ్గు చూపుతున్నారు. తమ ఫస్ట్ ఛాయిస్ గా కెనడాను ఎంచుకుంటున్నారు. గతంలో అమెరికా మొదటి ప్లేస్ లో ఉండగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఫస్ట్ ప్లేస్ లోకి కెనడా వచ్చింది.
ఆ తరువాత బ్రిటన్, ఆస్ర్టేలియా, జర్మనీ, యుఏఈ, రష్యా దేశాలకు మన స్టూడెంట్లు ఎక్కువగా వెళుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. కెనడాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఫీజు, మంచి కోర్సులు, పోస్ట్ -గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్(పీజీడబ్ల్యూపీ) అవకాశం ఉండటంతో ఎక్కువ మంది భారతీయులు కెనడాకు వెళుతున్నారు.
కెనడాలో స్టడీ పూర్తయిన తరువాత 3 సంవత్సరాల వరకు వర్క్ పర్మిట్, ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ద్వారా పీఆర్ పొందే అవకాశం ఉంటుంది. ఐటీ, నర్సింగ్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో డిమాండ్ బాగా ఉండటంతోపాటు ఫ్రెషర్స్‌కు మంచి జీతాలు వస్తుండటంతో ఎక్కువ మంది ఆ దేశానికే వెళుతున్నారని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు.
ఏటా12 లక్షల మంది
భారత్ నుంచి ఉన్నత విద్య కోసం ఏటా విదేశాలకు వెళ్లే స్టూడెంట్ల సంఖ్య12 లక్షల వరకు ఉందని విదేశాంగ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 40% (4,27,000) మంది కెనడాకు వెళ్లారు. ఇండియన్ స్టూడెంట్ల విషయంలో 2020 నుంచి ఇప్పటివరకు కెనడాయే నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ తరువాత అమెరికాకు 3.37 లక్షలు, బ్రిటన్ కు 1,85,000, ఆస్ర్టేలియాకు 1,22,000 మంది మన స్టూడెంట్లు వెళుతున్నట్లు ఈ లెక్కలు వెల్లడించాయి.
2016 నుంచి పెరిగిన డిమాండ్
ఇండియా నుంచి 2016 లో ఉన్నత చదవుల కోసం అత్యధిక మంది అమెరికా వెళ్లగా, కెనడా రెండో ప్లేస్ లో ఉంది. తర్వాత 2020 నుంచి ఈ ఏడాది వరకు కెనడా మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. అయితే, కెనడా ప్రభుత్వం కొత్త కోటా సిస్టమ్ ప్రకారం వీసాల సంఖ్యను తగ్గించింది. దీంతో కొందరు యూత్ ఇప్పుడు ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, ఐర్లాండ్ వైపు మళ్లుతున్నారు.
అయినా భారతీయులు ఇప్పటికీ కెనడాలో అతిపెద్ద ఇమ్మిగ్రెంట్ గ్రూప్‌గానే ఉన్నారు. 2025 నాటికి కూడా కెనడాకు ఇండియానే అతిపెద్ద ఇమ్మిగ్రెంట్ సోర్స్ కంట్రీగా ఉంది. అమెరికాలో హెచ్1బీ వీసా లాటరీ, లాంగ్ వెయిట్ టైమ్స్ (గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలు), ఆస్ట్రేలియాలో కూడా కఠినమైన పాయింట్స్ సిస్టమ్ ఉండటంతో ఓపెన్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉన్న కెనడా వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
అమెరికా, బ్రిటన్ కంటే కెనడాలో తక్కువ ఫీజు ఉండటంతో పాటు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునేందుకు, స్కాలర్ షిప్ కు అవకాశం ఉంది. కెనడాలో ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రంగాల్లో డిమాండ్ ఎక్కువ ఉందని, భారతీయ నిపుణులకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం ఉంటుందని కన్సల్టెన్సీల నిర్వహకులు చెబుతున్నారు.
అమెరికా, ఆస్ర్టేలియాకు తగ్గుతున్న డిమాండ్
ఉన్నత చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గుతోంది. ఇది ప్రధానంగా వీసా పాలసీలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణలు, ఆర్థిక కారణాల వల్ల జరుగుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ పాలసీల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంది. వీసా ఇంటర్వ్యూలు సస్పెండ్ చేయడం, సోషల్ మీడియా స్క్రూటినీ, హెచ్1బీ వీసా ఫీజును పెంచడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్‌లాగ్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ పబ్లిక్ చేయాల్సి రావడం తో ఈ ఏడాది అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య 44 శాతం తగ్గింది. ఇక ఆస్ర్టేలియాలో స్టూడెంట్ వీసాలు గత ఏడాది38 శాతం తగ్గగా, ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య13 శాతం తగ్గింది.
కెనడాలో సిటిజన్‌షిప్ చాలా ఈజీ
అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్ దేశాలతో పోలిస్తే కెనడాలో పర్మినెంట్ రెసిడెంట్ హోదా పొందటం చాలా సులభం. 2 ఏళ్లు చదువు పూర్తయితే 3 ఏళ్లు వర్క్ పర్మిట్ ఇస్తారు. తరువాత పర్మినెంట్ రెసిడెంట్(పీఆర్)గా 5 ఏళ్లు చాన్స్ ఇస్తారు. అక్కడ సిటిజన్ షిప్ పొందటం చాలా ఈజీ. ఇతర దేశాలతో పోలిస్తే కెనడా యూనివర్సిటీల్లో ఫీజులు కూడా తక్కువగా ఉన్నాయి.
కెనడాలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు యూబీసీ(ది యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా).. కంప్యూటర్ కోర్సులకు బీసీఐటీ (బ్రిటీష్ కొలంబియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) టాప్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. ఇవి ఇండియాలోని ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా ఉంటాయి. కెనడా యూనివర్సిటీలో సీటు వస్తే స్కాలర్ షిప్ తో పాటు పార్ట్ టైమ్ జాబ్స్ కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక కంపెనీలు సైతం వివిధ ప్రాజెక్టుల కోసం కెనడాలో వర్క్ చేసేందుకు ఇండియన్లను తీసుకువస్తున్నాయి.
- శ్రీకాంత్, కెనడాలో చదువుతున్న హైదరాబాద్ స్టూడెంట్
2024, 2020లో ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్లు వెళ్లిన దేశాలు
కెనడా 4,27,000 (2024 1,79,480 (2020)
అమెరికా 3,37,630 1,67,582
బ్రిటన్ 1,85,000 90,300
ఆస్ర్టేలియా 1,22,202 1,15,137
జర్మనీ 42,997 35,147
యుఏఈ 25,000 –
రష్యా 24,940 14,370
