యాసంగి మిల్లింగ్ గడువు పెంపు

యాసంగి మిల్లింగ్ గడువు పెంపు
  • మే 15 దాకా అవకాశం ఇచ్చిన కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు : నిరుడు యాసంగి మిల్లింగ్‌‌ గడువును మే 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ దీపేంద్ర సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లింగ్‌‌ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న కేంద్రానికి లెటర్‌‌ రాసింది. లాస్ట్‌‌ ఇయర్‌‌ యాసంగి పెండింగ్‌‌లో ఉన్న కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ (సీఎంఆర్‌‌).. మే 15 దాకా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. షెడ్యూల్‌‌ ప్రకారం పెండింగ్‌‌ సీఎంఆర్‌‌ డెలివరీ చేసేలా చూడాలని కోరింది. మిల్లుల వారీగా షెడ్యూల్‌‌ను రాతపూర్వకంగా తీసుకోవాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎఫ్​సీఐకి సూచించింది. ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్‌‌ డెలివరీ చేసే టైమ్​లో బియ్యాన్ని టెస్ట్‌‌ చేసి ఎప్పటివో నిర్ధారించాలని ఆదేశించింది. మిల్లింగ్ సామర్థ్యం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి దీపేంద్ర సింగ్‌‌ సూచించారు.

27.31 లక్షల టన్నుల సీఎంఆర్ పెండింగ్

2022 – 23 యాసంగికి సంబంధించి.. రైతుల నుంచి సేకరించిన 66.84 లక్షల ధాన్యాన్ని మిల్లింగ్‌‌ చేసే బాధ్యతను సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ మిల్లర్లకు అప్పగించింది. 45.09 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్​సీఐకి అప్పగించాల్సి ఉంది. కాగా, ఇప్పటి దాకా మిల్లర్లు 17.78 లక్షల టన్నుల సీఎంఆర్ మాత్రమే అప్పగించారు. ఇంకా 27.31 లక్షల టన్నుల సీఎంఆర్ పెండింగ్​లో ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా సీఎంఆర్ గడువు పెంచింది.