ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి .. ఫలించిన రాష్ట్ర సర్కారు ప్రయత్నం

ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి .. ఫలించిన రాష్ట్ర సర్కారు ప్రయత్నం
  •  సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీటిని తీసుకోవాలని కేంద్ర సర్కారు ఆలోచన
  • సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం
  • జులై 9న ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి 
  • సమావేశంలో తుది నిర్ణయం
  • మీటింగ్ ఎజెండా రాష్ట్రాలకు చేరవేత

హైదరాబాద్, వెలుగు : గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కడతామని ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర సర్కారు ఒత్తిడితో వెనక్కి తగ్గింది. తాజాగా సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) నుంచి నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, రిపేర్లు చేసినా బ్యారేజీకి లైఫ్ ఉంటుందన్న గ్యారంటీ ఇవ్వలేమని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ(ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ) రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపై స్టడీ చేయాలని డిసైడ్ అయ్యింది. 

ఇప్పటికే పూర్తయిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచే నీటిని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి తేల్చి చెప్పింది. కానీ కేంద్రం మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని గత బీఆర్ఎస్ సర్కారు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించాయి. 

దీంతో కేంద్రం నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. జులై 9న జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాల ఎజెండాను శుక్రవారం కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌లో బ్యారేజీ ఎత్తు, నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలను పరిశీలించనున్నట్లు సమాచారం ఇచ్చింది.

ఇచ్చంపల్లిపై ఆది నుంచి అభ్యంతరాలు

తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లను మళ్లించేందుకు వీలుగా 1980లో 118 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో ఈ బ్యారేజీ ఎత్తును 112 మీటర్లకు తగ్గించారు. మళ్లీ 1986-–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు‌‌‌‌‌‌‌‌. ఇప్పుడు నదుల అనుసంధానంలో భాగంగా దీనిని 87 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని  భావించారు. 

ఆ ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలనుకున్నా చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని నాలుగు గ్రామాలు ముంపుకు గురవుతాయన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  ఆ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కూడా పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. మరోవైపు ఇచ్చంపల్లికి కేవలం 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉండడం, దీని నిర్మాణం ఇప్పటికే పూర్తికావడంతో ఇచ్చంపల్లి నుంచి వరద నీటిని హఠాత్తుగా విడుదల చేయాల్సి వస్తే ఫ్లడ్​ను నియంత్రించే పరిస్థితుల్లేవని, బ్యారేజీల మధ్య దూరం తక్కువగా ఉంటే ఫ్లడ్ రూటింగ్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు వస్తాయని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. 

ఇచ్చంపల్లికి దిగువన 158 టీఎంసీల (దేవాదుల 38 టీఎంసీలు, సీతారామ 70 టీఎంసీలు, తుపాకులగూడెం 50 టీఎంసీ) నీటి వినియోగం ఉందని, ఇచ్చంపల్లి బ్యారేజీ కట్టి నీటిని కావేరికి మళ్లిస్తే  దిగువన ఉన్న ప్రాజెక్టుల కింద నీటి అవసరాలు తీర్చడం కష్టమవుతుందని కూడా తెలంగాణ తేల్చిచెప్పింది. 

కేంద్రం కొత్త ప్రతిపాదన

తాజాగా మేడిగడ్డకు గ్యారంటీ లేదని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడంతో.. కేంద్రం కొత్త ప్రతిపాదన తెరమీదికి తెచ్చింది. మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి వద్ద ఎత్తు పెంచి రిజర్వాయర్ కట్టి, బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద వాడుకోవడానికి వెసులుబాటు ఇస్తామని తెలంగాణకు ఆఫర్​ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఇచ్చంపల్లికి ఒప్పుకోవాలని పలువురు నీటిపారుదల నిపుణులు కూడా సూచనలు చేశారు. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో జులై 9న న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.