ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‎లో భాగంగా కేంద్ర కేబినెట్‎లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గతాన్ని స్మరించుకుంటే.. స్వాతంత్యం కోసం పోరాడింది ఎక్కువగా గిరిజనులే. అందులో భగవాన్ బిర్సా ముండా ఒకరు. ఆయన జన్మదినం నవంబర్ 15 సందర్భంగా.. ఆ రోజును గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులంతా కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నెల 15 నుంచి 22 వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించాలి. బిర్సా ముండా బతికింది 25 సంవత్సరాలే అయినా.. బ్రిటీష్ వాళ్లతో వీరోచితంగా పోరాడి జైలులో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన చనిపోయిన రాంఛీ జైలును కేంద్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చింది. అందులో భాగంగా ఆ ట్రైబల్ మ్యూజియంను ప్రధాని మోడీ నవంబర్ 15న ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యప్రదేశ్ లో 2 లక్షల మంది గిరిజనులతో నిర్వహించే జాతీయ గిరిజన దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అంతేకాకుండా.. బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో కూడా ఒక ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. అందుకోసం కేంద్రం రూ. 15 కోట్లు విడుదలచేయనుంది. ఈ నిధులతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో త్వరగా ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలి. దీనికోసం ఇప్పటికే రూ. కోటి విడుదల కూడా అయ్యాయి. అయినా కూడా పనులు ఇంకా మొదలుకాలేదు. కేంద్రం నిధులకు తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 3 కోట్లు ఇస్తామని తెలిపింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభం అయ్యేలా చూడాలి.

హుజురాబాద్ ఎన్నిక కాగానే కేసీఆర్‎కు రైతులు గుర్తుకొచ్చారా?

ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే ప్రతి పైసా కేంద్రానిదే. బాయిల్డ్ రైస్ తో కేంద్రానికి సంబంధం లేదు. బాయిల్డ్ రైస్ కొనేదిలేదని మూడేళ్లుగా చెబుతూనే ఉన్నాం. మూడేళ్ల నుంచి కూడా కేసీఆర్ కోసం కాదు.. రైతుల కోసమే బాయిల్డ్ రైస్ కొంటున్నాం. కేంద్ర రైతులకు ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలి. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని తెలంగాణ చెప్పింది. ఆ తర్వాత 90 లక్షలు మెట్రిక్ టన్నులు పంపుతామని, మరోసారి 108 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖ రాశారు. ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటాం. ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ ధర్నాలు ఎవరి మీద? హుజురాబాద్ లో ఓడగొట్టిన ప్రజలు, రైతుల మీద చేస్తుందా? ధర్నాల మీద కాకుండా.. ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇది కల్వకుంట్ల కుటుంబం సమస్య కాదు.. రైతుల సమస్య. హుజురాబాద్ ఎన్నిక కాగానే కేసీఆర్‎కు రైతులు గుర్తుకొచ్చారా?’ అని కిషన్ రెడ్డి అన్నారు.