యూజర్లకు హాని కలిగించే.. ఆన్‌‌లైన్‌‌ నేరాలపై కేంద్రం ఫోకస్

యూజర్లకు హాని కలిగించే.. ఆన్‌‌లైన్‌‌ నేరాలపై కేంద్రం ఫోకస్
  • ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను రెడీ చేస్తున్న కేంద్రం
  • క్రిప్టోజాకింగ్, ఆస్ట్రోటర్ఫింగ్, గ్యాస్‌‌లైటింగ్, క్యాట్‌‌ఫిషింగ్‌‌.. వంటి ఎన్నో నేరాలకు డెఫినేషన్
  • ఆయా నేరాలకు పడే శిక్షల గురించీ వివరణ
  • తుది దశలో ముసాయిదా బిల్లు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెట్టే చాన్స్

న్యూఢిల్లీ: 23 ఏండ్ల నాటి ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం’ స్థానంలో కొత్త బిల్లు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆన్‌‌లైన్‌‌ నేరాలను కట్టడి చేసేందుకు ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను రెడీ చేస్తున్నది. ఈ బిల్లులో క్రిప్టోజాకింగ్, ఆస్ట్రోటర్ఫింగ్, డాగ్‌‌పైలింగ్‌‌, డాగ్ విజిలింగ్, స్వాటింగ్, గ్యాస్‌‌లైటింగ్, క్యాట్‌‌ఫిషింగ్ వంటి ఎన్నో ఆన్‌‌లైన్ నేరాలను నిర్వచించడంతోపాటు ఎన్‌‌కోడ్ చేయనుంది. ‘‘వినియోగదారులకు హాని కలిగించే కేటగిరీ కింద ఆయా నేరాలను బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. వాటికి పడే శిక్షల నిబంధనలను కూడా డిఫైన్ చేయనున్నారు” అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

బిల్లు ప్రస్తుతం తుది దశలో ఉందని చెప్పాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా అథారిటీ, నేషనల్ డేటా మేనేజ్‌‌మెంట్ ఆఫీస్ ఏర్పాటు గురించి కూడా పేర్కొనే అవకాశం ఉందన్నాయి. ‘‘తప్పుడు సమాచారం తీరుతెన్నులు, దాన్ని ప్రచారం చేసిన వివిధ మార్గాల గురించి కూడా ఐటీ శాఖ నిర్వచించే అవకాశం ఉంది. డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి డిజిటల్ రూపంలో సృష్టించిన నకిలీ సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని కొత్త చట్టం ప్రకారం నిరోధిస్తారు” అని అధికారులు చెప్పారు. డిజిటల్ ఇండియా బిల్లు ముసాయిదా సిద్ధంగా ఉందని, త్వరలో సంప్రదింపుల కోసం విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. 

కంపెనీలకు కొన్ని మినహాయింపులు

ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా, ఇతర ఇంటర్ మీడియరీస్‌‌ (మధ్యవర్తులు)కు ఇచ్చిన మినహాయింపులను కొత్త చట్టంలో తొలగించనున్నారు. ‘‘అయితే పరిమాణం, స్వభావం, ఇంటర్ మీడియరీ ప్రాముఖ్యత ఆధారంగా.. అదనపు భద్రతా ఏర్పాట్లను బిల్లులో సూచించవచ్చు. తాము పొందే థర్డ్ పార్టీ కంటెంట్ నుంచి ఆయా సంస్థలకు మినహాయింపులను కూడా ఇవ్వొచ్చు. ఇంటర్ మీడియరీస్ తమ డిజిటల్ సిస్టమ్‌‌లో అందుబాటులో ఉన్న ఏదైనా సమాచారం విషయంలో బాధ్యత నుంచి మినహాయింపును పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి మినహాయింపులకు అర్హులా? కాదా? అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. పలు అంశాలను పరిశీలించిన తర్వాత, కంపెనీ తీసుకున్న చర్యలు సర్యేనవేనని భావిస్తే మినహాయింపులు ఇవ్వనుంది” అని అధికారులు తెలిపారు. 

యూజర్ల కోసం మెకానిజం 

‘‘వ్యక్తులు లేదా సంస్థలు డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌లోని యూజర్ అగ్రిమెంట్ రూల్స్‌‌ను లేదా డిజిటల్ ఇండియా చట్టంలోని రూల్స్‌‌ను పదేపదే ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే వారికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇంటర్ మీడియరీస్‌‌కు పవర్ ఇవ్వనుంది. మరోవైపు ఇప్పటికే ఉన్న ఫిర్యాదు స్వీకరణ యంత్రాంగానికి తోడు.. ఇంటర్నెట్ ఇంటర్ మీడియరీస్‌‌ తీసుకున్న నిర్ణయాలను యూజర్లు సవాలు చేసేందుకు ఓ మెకానిజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పొందుపరచనుంది” అని ఆఫీసర్లు చెప్పారు. ‘‘కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను రక్షించుకోవడానికి అనుసరించాల్సిన వివిధ మార్గాలను కూడా ఈ బిల్లు నిర్వచిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రొటెక్టెడ్ సిస్టమ్‌‌ను యాక్సెస్‌‌ చేసే, యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది” అని వివరించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో నోడల్ ఏజెన్సీగా పనిచేయడానికి ప్రభుత్వం ‘ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ’ని నోటిఫై చేసే అవకాశం ఉందన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సర్ట్-ఇన్) మాదిరిగానే ఈ ఏజెన్సీ పనితీరు ఉండే అవకాశం ఉందని తెలిపారు.