
తమిళనాడు అసెంబ్లీ ఎన్ని్కలు దగ్గరపడడంతో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల మధ్య పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార డీఎంకే- -- కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. అటు బీజేపీ-- అన్నాడీఎంకే పొత్తు దాదాపు కొలిక్కి వచ్చేసింది. మరోవైపు 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ నటుడు 'దళపతి' విజయ్ తన సత్తాచాటేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం , ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడులో బీజేపీ స్థానం లేదని విజయ్ దుయ్యబట్టారు . అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తమిళరాజకీయల్లో పెను ప్రకంపనలు స్పష్టింబోతున్నట్లు పేర్కొన్నారు. అటు తమిళగ వెట్రి కళగం'( TVK )కార్యవర్గ సమావేశం తమ పార్టీ సీఎం అభ్యర్థి విజయ్ అని తీర్మానించింది. ఈ సందర్భంగా అధికార డీఎంకే, బీజేపీపై విజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. . తమ ప్రజలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దే కేంద్రం ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని .. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం కాదని , తమళనాట ప్రజల సాంస్కృతిక అస్తిత్వం, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని పేర్కొన్నారు.
ALSO READ : తిరుమల కొండపై మంటలు : వేగంగా స్పందించటంతో తప్పిన ప్రమాదం
రాష్ట్రంలో బీజేపీ కొత్త కుట్రకు తెరతీసిందని విజయ్ విమర్శించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై అనుమాలను వ్యక్తం చేశారు. మైనార్టీ వర్గాల ఓట్ల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా బీజేపీ కుట్రచేస్తుందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఒక వర్గానికి కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని మండిపడ్దారు. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో TVK విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు.