పాక్‎కు చైనా సహయం చేసింది.. ఇండియాకు ఒకే బార్డర్‎లో ముగ్గురు శత్రువులు: టాప్ ఆర్మీ జనరల్

పాక్‎కు చైనా సహయం చేసింది.. ఇండియాకు ఒకే బార్డర్‎లో ముగ్గురు శత్రువులు: టాప్ ఆర్మీ జనరల్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‎కు చైనా, టర్కీ అందించిన సహయంపై భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్‌పై ఎఫ్ఐసీసీఐ  శుక్రవారం (జూలై 4) నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్‎గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ దేశాలు పాకిస్థాన్ కు సహయం చేశాయని కీలక వ్యాఖ్యలు చేశారు.  

చైనా నుంచి పాకిస్తాన్ ప్రత్యక్ష నిఘా సమాచారాన్ని స్వీకరిస్తుందని..  భారతదేశ కీలకమైన సైనిక మోహరింపులపై వివరాలను చైనా దాయాది దేశానికి అందించిందని ఆరోపించారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు.. భారత వెక్టర్లు దాడికి సిద్ధంగా ఉన్నాయనే మాకు తెలుసునని పాకిస్తాన్ చెప్పిందని.. ఈ నిఘా సమాచారాన్ని చైనా తమ మిత్ర దేశం పాకిస్థాన్‎కు అందించిందని తెలిపారు. 

పాకిస్తాన్, చైనా మధ్య పరస్పర సహకారానికి ఈ ఘటనే నిదర్శమని పేర్కొన్నారు రాహుల్ సింగ్. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‎తో పాటు చైనా, టర్కీ ముగ్గురు ప్రత్యర్థులను భారత్ ఎదుర్కొన్నదన్నారు. భారత్‎కు సంబంధించిన నిఘా సమాచారాన్ని చైనా అందిస్తే.. ఇండియాపై దాడికి పాకిస్తాన్‎కు టర్కీ డ్రోన్లు అందించిందని తెలిపారు. బేరక్తర్ డ్రోన్‌లు, అనేక ఇతర మానవరహిత వైమానిక వ్యవస్థలను టర్కీకి పాక్ కు సరఫరా చేసిందన్నారు.

ALSO READ | ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు

 భారత్ విషయంలో కేవలం పాకిస్తాన్ ముందు వరుసలో ఉంది. వెనక నుంచి చైనా అన్ని విధాలుగా మద్దతు ఇస్తోంది. ఇదే సమయంలో టర్కీ కూడా తమ మిత్ర దేశానికి తోడ్పాడు అందిస్తోందని అన్నారు రాహుల్ సింగ్. పాకిస్తాన్ సైనిక హార్డ్‌వేర్‌లో 81% చైనా నుండే వస్తున్నాయని.. చైనా రక్షణ సాంకేతికతకు పాకిస్తాన్ పరీక్షా కేంద్రంగా మారుతుందన్నారు. 

ఆపరేషన్ సిందూర్‎లో భారత వైమానిక రక్షణ కీలక పాత్ర పోషించిందన్నారు. పాకిస్తాన్, చైనా, టర్కీల మధ్య సైనిక సహకారం పెరుగుతోన్న భారత్ తన వైమానిక రక్షణ, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. డ్రోన్ల ముప్పు, ఆధునిక యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడానికి భారత్ బలమైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 

కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా, టర్కీ సహయం చేసిన విషయం తెలిసిందే. చైనా గగనతల రక్షణ వ్యవస్థ, మిస్సైళ్లను పాక్‎కు పంపగా.. టర్కీ డ్రోన్ల సహయం చేసింది. భారత్ వీటిని ధ్వంసం చేయడంతో పాక్‎కు చైనా, టర్కీ సహయం చేసిన విషయం బయటపడింది.