
టెక్ రాజధాని బెంగళూరులో విలాసవంతమైన జీవితం గడుపుతున్న సంపన్నులు ఎంతో మంది. అయితే తాజాగా ఐటీ నగరంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక లగ్జరీ ఫెరారీ కారు యజమాని రోడ్డు పన్ను కట్టకుండా ఏడాది నుంచి తిరుగుతున్నట్లు అక్కడి ఆర్టీవో అధికారులు గుర్తించారు.
వాస్తవానికి ఫెరారీ విలువ రూ.7కోట్ల 50 లక్షలకు పైనే. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన కారు అది. అయితే ఫెరారీ ఓనర్ దానికి కేవలం రూ.20 లక్షలు మాత్రమే పన్నుగా చెల్లించినట్లు తేలింది. అయితే సెప్టెంబర్ 2023 నుంచి కారును కర్ణాటకలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ఉపయోగిస్తు్నట్లు వారు గుర్తించారు. కర్ణాటకలో నడిపేందుకు చెల్లించాల్సిన జీవితకాల రోడ్డు పన్నును ఎగవేసినట్లు ఆర్టీవో అధికారుల దర్యాప్తులో తేలింది.
దీంతో ఫెరారీ SF90 స్ట్రాడేల్ కారును అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పన్ను బకాయిలు చెల్లించకపోతే మోటార్ వాహన చట్టాల ప్రకారం స్వాధీనం చేసుకుంటామని సదరు యజమానికి నోటీసులు ఇచ్చారు. దీంతో గంటల్లోనే మెుత్తం బకాయి చెల్లించాలని అధికారులు డెడ్ లైన్ ఇవ్వటంతో రూ.కోటి 42 లక్షలు చెల్లించాడు కారు ఓనర్. ఉదయం నగరంలోని లాల్ బాగ్ ప్రాంతంలో తిరుగుతున్న కారును ఆపగా పత్రాల కోసం అడిగితే ఇంట్లో ఉన్నట్లు డ్రైవర్ బదులిచ్చాడని, దీంతో పరిశీలించగా అసలు విషయం బయటపడిందని ఆర్టీవో అధికారులు వెల్లడించారు.
ALSO READ : 35 కోట్ల మంది నిరుపేదలే..
వాస్తవానికి కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్ట్ నియమాల ప్రకారం.. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు కర్ణాటకలో ఎలాంటి లైఫ్ టైం టాక్స్ చెల్లించకుండా ఒక ఏడాది వరకు తిరగటానికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడైంది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా కారు యజమానులు వాటిని కర్ణాటకలో వినియోగించాలంటే అందుకోసం అక్కడి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని విస్మరిస్తే సదరు వాహనాన్ని వారు సీజ్ చేస్తారు. అయితే ప్రస్తుతం పట్టుబడ్డ ఫెరారీ దాదాపు 18 నెలల నుంచి బెంగళూరు నగరంలో తిరుగుతోందని అధికారులు గుర్తించటంతో యజమాని నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేశారు.