35 కోట్ల మంది నిరుపేదలే.. మూడు పూటలా తినటానికే తిండే లేదా.. : ప్రపంచ బ్యాంక్ సంచలన రిపోర్ట్

35 కోట్ల మంది నిరుపేదలే.. మూడు పూటలా తినటానికే తిండే లేదా.. : ప్రపంచ బ్యాంక్ సంచలన రిపోర్ట్

ప్రపంచంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో ప్రజల ఆకలి కేకలు ఇంకా మిగిలే ఉన్నాయనే విషయం వాస్తవం. ఆర్థికంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా ఎదిగిన భారత్.. ఇంకా ప్రజల జీవితాలను మెరుగుపరచటంలో కొంత వెనుకపడిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 

తీవ్రమైన దారిద్యం నుంచి ప్రజలను పైకి తీసుకురావటంలో భారత్ మంచి పురోగతిని నమోదు చేసింది. అయితే ఇప్పటికీ ప్రతి నాలుగురిలో ఒకరు కనీస జీవన ప్రమాణాల కంటే దిగువనే గడుపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన తాజా రిపోర్ట్ వెల్లడించింది. అంటే దేశంలోని 35 కోట్ల మంది ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. వారు కటికపేదల కిందకు కానప్పటికీ.. ఇల్లు, వైద్యం, విద్య, బలవర్థకమైన ఆహారం వంటి కనీస అవసరాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక తేల్చింది.

2011 నుంచి ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలు పేదరికాన్ని ఇండియాలో తగ్గించటానికి కొంత దోహదపడింది. అయినప్పటికీ 7 కోట్ల మంది ఇప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచ కనీస రోజువారీ ఆదాయం 3 డాలర్లు అంటే రోజుకు రూ.250 సంపాద కూడా లేనివారు మాత్రమే పేదలుగా పరిగణించబడుతున్నారు. కానీ ఈ రేటు ప్రస్తుతం ఉన్న భారతదేశానికి సరిపోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన ప్రకారం సగటు రోజువారీ ఆదాయం 4.2 డాలర్లు అంటే రూ.350 అవసరం అని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 

పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా కొలమానంగా 4.2 డాలర్ల రోజువారీ ఆదాయాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే రూ.350 రోజువారీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ భారతదేశంలో 35 కోట్ల మంది కనీస రోజువారీ అవసరాలను తీర్చుకోవటంలో కష్టపడుతున్నారని తేలింది. అయితే భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలైన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని పరిగణలోకి తీసుకుంటోంది. ఎందుకంటే ఇందులో విద్య, శుభ్రత, విద్యుత్, హౌసింగ్ వంటి అనేక ఇతరాలను ప్రమాణాలుగా పరిగణిస్తారు. 

ALSO READ : మన స్టాక్ మార్కెట్లో రూ.43వేల కోట్ల కుంభకోణం జరిగింది ఇలానే.. ఈ డబ్బంతా ఎవరి దగ్గర కొట్టేశారు!

ఇదే క్రమంలో భారతదేశంలోని సంపన్నులు, పేదల మధ్య దూరంగా ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ఇండియా గినీ సూచీ ప్రకారం దేశంలోని 1 శాతం సంపన్నులు 40 శాతం జాతీయ సంపదను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అలాగే అట్టడుగున ఉన్న 50 శాతం మంది భారతీయుల చేతిలో 6.4 శాతం మాత్రమే సంపద ఉన్నట్లు వెల్లడైంది. నగరాల్లో అధిక అద్దెలు, స్థిరత్వం లేని ఉద్యోగాలతో పేదరికం అంచునే నివసించేలా ప్రజలను చేస్తోందని వెల్లడైంది. ఇక గ్రామాల విషయానికి వస్తే చిన్న పొలాలు, సీజన్ల ప్రకారం పనులు ప్రజలకు స్థిరమైన ఆదాయం లేకుండా చేస్తోందని తేలింది. ఈ సమయంలో సగటు భారతీయ కుటుంబం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగం కోల్పోవటం, వేతనం ఆలస్యం వంటి సమస్యలు ఎదుర్కొంటే వారి కుటుంబాలు కష్టాల్లో చిక్కుకుంటున్నాయని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించింది.