
Jane Street Scam: అమెరికాలోను న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్. ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో 2వేల 600 మంది ఉద్యోగులతో అనేక అసెట్ క్లాసెస్ కింద కంపెనీ తన పెట్టుబడులను పెడుతోంది. ఇందుకోసం వివిధ దేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. అయితే ఇండియాలో సంస్థకు చెందిన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా వీరి కార్యకలాపాలను పరిశీలించిన సెబీ తాత్కాలికంగా వారిని ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా భారత స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధించటం కలకలం రేపుతోంది.
దీనికి తోడు జేన్ స్ట్రీట్ సంస్థకు చెందిన జేన్ స్ట్రీట్ సింగపూర్ పిటిఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థలను కూడా సెబీ బ్యాన్ చేసింది. అలాగే ఈ సంస్థలు సెబీ సూచించిన విధంగా ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో అక్రమంగా సంపాదించిన లాభాలు రూ.4వేల 843.5 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది. మెుత్తానికి ఈ సంస్థ భారత ఈక్విటీ మార్కెట్లలో ఏకంగా రూ.43వేల కోట్లకు పైగా స్కామ్ కి పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
జేన్ స్ట్రీట్ కుంభకోణం జరిగింది ఇలానే..
సెబీ అందించిన వివరాల ప్రకారం.. జేన్ స్ట్రీట్ సంస్థలు మెుత్తం 14 ఆప్షన్ ట్రేడింగ్ రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను భారీగా కొనుగోలు చేశాయి. అలాగే అదే స్థాయిలో క్యాష్ సెగ్మెంట్ కింద కూడా భారీ కొనుగోళ్లు చేపట్టాయి. దీని తర్వాత పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లను ఎక్స్ పెయిరీ రోజు ఉదయాన్నే అమ్మేశాయి. దీని తర్వాత మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్లలో జేన్ స్ట్రీట్ సంస్థలు అధిక సంఖ్యల్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను కూడా అమ్మేవి. దీని ద్వారా మార్కెట్ల క్లోజింగ్ సమయానికి భారీగా సూచీలను ప్రభావితం చేసినట్లు సెబీ గుర్తించింది.
Also Read : స్టాక్ మార్కెట్లో రూ.43వేల కోట్ల కుంభకోణం
లాభం ఎక్కువ నష్టం తక్కువ ఇలాగే..
జనవరి 17, 2024 ఉదయం జేన్ స్ట్రీట్ రూ.4వేల 370 కోట్లు విలువైన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను కొంది. అలాగే రూ.32వేల 115 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లను అమ్మింది. మధ్యాహ్నం సెషన్లో బ్యాంక్ నిఫ్టీ అంతర్లీన ఫ్యూచర్లలో రూ.5వేల 372 కోట్లకు దూకుడుగా అమ్మేసింది. ఈ మెుత్తం చర్య వల్ల బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్లలో రూ.46వేల 620 కోట్లకు షార్ట్ పొజిషన్లను జేన్ స్ట్రీట్ సంస్థలు కలిగి ఉన్నాయి. ఇలా చేయటం వల్ల బ్యాంక్ నిఫ్టీ సూచీ క్లోజింగ్ నెమ్మదిగా ముగుస్తుంది. ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఇలా బ్యాంక్ నిఫ్టీ సూచీలను స్లో చేయటం వల్ల సాఫ్ట్ క్లోజింగ్ ఏర్పడి ఆప్షన్స్ విభాగంలో రూ.735 కోట్ల లాభాన్ని జేన్ స్ట్రీట్ సంస్థలు పొందాయి. అయితే మరో పక్క క్యాష్, ఫ్యూచర్స్ విభాగంలో కేవలం రూ.61 కోట్ల 60లక్షలు నష్టాన్ని పొందేవి. మెుత్తం మీద ఈ ట్రేడింగ్ స్ట్రీటజీ కారణంగా ఒక్క రోజులోనే జేన్ స్ట్రీట్ నికరంగా రూ.673కోట్ల 40 లక్షల లాభాన్ని చూసింది.
జేన్ స్ట్రీట్ రెండో ట్రేడింగ్ ప్లాన్..
ఇదే విధంగా జేన్ స్ట్రీట్ సంస్థ కనుక్కున్న మరో హ్యాహంలో భాగంగా మార్కెట్ల ముగింపుకు కేవలం రెండు గంటల ముందు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లు, క్యాష్ విభాగాల్లో అమ్మకాల ద్వారా భారీగా షార్ట్ పొజిషన్లను క్రియేట్ చేసి సూచీలను తారుమారు చేసేది. దీని ద్వారా కూడా లాభాలను ఆర్జించినట్లు సెబీ తేల్చింది. జూలై 10, 2024న, జేన్ స్ట్రీట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లను దూకుడుగా రూ.2,800 కోట్లకు విక్రయించటం ద్వారా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లలో రూ.44,154 కోట్లకు షార్ట్ పొజిషన్‌ను సృష్టించింది. అందువల్ల సూచీలు ముగింపును తనకు కావాల్సినట్లుగా మార్చుకుని రూ.225 కోట్ల లాభం ఆర్జించిందని సెబీ దర్యాప్తులో తేలింది.
ఇలాంటి ట్రేడింగ్ మానుకోవాలని సెబీ జేన్ స్ట్రీట్ సంస్థకు నోటీసుల ద్వారా హెచ్చరించినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తన ట్రేడింగ్ కొనసాగించింది అమెరికా సంస్థ. ఇలా మార్కెట్ల క్లోజింగ్ సమయానికి సూచీలపై పట్టు సాధిస్తూ కోట్లు కొల్లగొట్టింది. నిఫ్టీ ఫ్యూచర్లతో పాటు దానిలో ఉన్న షేర్లను క్యాష్ సెగ్మెంట్లో హోల్డ్ చేస్తూ ఏకకాలంలో మార్కెట్లను నియంత్రించటం ద్వారా ఇది సాధ్యపడినట్లు సెబీ గుర్తించింది. అమెరికా సంస్థ చేసిన పని వల్ల చిన్న ట్రేడర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో భారీ నష్టాలను చూసేవారు. అంటే భారతీయ ఇన్వెస్టర్లను నష్టపరచటం ద్వారా అమెరికాకు చెందిన జేన్ స్ట్రీస్ సంస్థ లాభాలను కొల్లగొట్టేది. వాస్తవానికి ఇలాంటి విధానాలు అక్రమ ట్రేడింగ్ చర్యలుగా భారతదేశంలో పరిగణించబడుతోంది.