మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో..
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం


జన్నారం రూరల్‌‌‌‌, వెలుగు: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో ఓ మహిళ తన 11 నెలల కూతురితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటుపల్లి శ్రవణ్‌‌‌‌కు జగిత్యాల జిల్లా సారంగాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన స్పందన (24)తో నాలుగేండ్ల కింద వివాహమైంది. గతంలో ఓ కూతురు ఉండగా.. 11 నెలల కింద చిన్నకూతురు వేదశ్రీ పుట్టింది. దీంతో ఇద్దరూ ఆడపిల్లే పుట్టారని స్పందన మానసికంగా ఆవేదనకు గురైంది.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చిన్న కూతురు వేదశ్రీకి అన్నం తినిపించుకుంటూ ఇంటి ముందు తిరుగుతోంది. కొద్దిసేపటి తర్వాత స్పందనతో పాటు వేదశ్రీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించారు. అనుమానం వచ్చి సమీపంలో ఉన్న బావిలో వెతకగా.. ఇద్దరి డెడ్‌‌‌‌బాడీలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.