గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య.. తట్టుకోలేక భర్త..

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య.. తట్టుకోలేక భర్త..
  •     అనారోగ్యంతో చనిపోయిన భార్య.. తట్టుకోలేక భర్త..  
  • కమ్మర్‌‌పల్లిలో విషాదం

దహెగాం, వెలుగు : అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌‌పల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.

వీరికి పిల్లలు లేరు. వినోద్‌‌ కేబుల్‌‌ టీవీ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటోంది. గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయింది.

శుక్రవారం అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.