ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులకు భారీగా ఓట్లు

ఆదిలాబాద్ జిల్లాలో  అభ్యర్థులకు భారీగా ఓట్లు
  •     స్వల్ప తేడాతో పలువురి ఓటమి

మంచిర్యాల/ ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తే.. మరికొందరికి నాలుగైదు ఓట్లు కూడా రాలేదు. మంచిర్యాల కార్పొరేషన్​14 డివిజన్​లో మొత్తం 2,987 ఓట్లు ఉండగా, ,2455 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్​అభ్యర్థి తూముల నరేశ్​కు ఏకంగా 1,999 ఓట్లు వచ్చాయి. సమీప బీఆర్ఎస్​ అభ్యర్థికి 331, బీజేపీ కేవలం 72 ఓట్లు వచ్చాయి. నరేశ్​1,668 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

రీకౌంటింగ్​లో 12 ఓట్లతో..

మంచిర్యాల కార్పొరేషన్​57 డివిజన్​లో బీజేపీ అభ్యర్థి గాజుల ముఖేశ్​గౌడ్ రీకౌంటింగ్​లో 12 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్​అభ్యర్థి బుద్ధార్థి రాంచందర్​కు 936, ముఖేశ్​గౌడ్​కు 948 ఓట్లు వచ్చాయి. ముందుగా 05 ఓట్లతో రాంచందర్ గెలిచినట్టు ప్రకటించగా, బీజేపీ ఏజెంట్లు రీకౌంటింగ్​కోసం పట్టుబట్టారు. 12 ఓట్లతో ముఖేశ్​గెలిచారు. పార్టీ హైకమాండ్​ ఆయనను బీజేపీ మేయర్​అభ్యర్థిగా ప్రకటించి బరిలో దించినప్పటికీ తన గెలుపుకోసం పోరాడాల్సి వచ్చింది. 

968 ఓట్లతో గెలిచిన చరణ్ 

ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో అత్యధిక మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ గౌడ్ గెలుపొందాడు. 40వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ గౌడ్ బీజేపీ అభ్యర్థి రఘుపతిపై 968 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అన్ని వార్డుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. 34వ వార్డు బీజేపీ అభ్యర్థి వకులాభరణం నిఖిల 12 ఓట్ల తేడాతో ఓడిపోగా, 31 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జబీనా షేక్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.