ఆదిలాబాద్ జిల్లాలో మున్సి పల్ చైర్ పర్సన్లకు పోటీ

ఆదిలాబాద్ జిల్లాలో  మున్సి పల్ చైర్ పర్సన్లకు పోటీ
  •     పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్న ఆయా పార్టీల అధిష్ఠానాలు
  •     మేయర్​ పీఠంపై నరేశ్, రమ్య, మధుకర్, రజిత గురి!

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించగా.. కాంగ్రెస్​ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన తూముల నరేశ్​(14 డివిజన్), సల్ల రమ్య(54 డివిజన్), ధర్ని మధుకర్(32 డివిజన్), పెంట రజిత(46 డివిజన్) మేయర్ ​పీఠాన్ని ఆశిస్తున్నారు. వీరంతా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ర్టవ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లలో ఎక్కడ ఏ కులానికి మేయర్ పోస్టు ఇవ్వాలనే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ మేయర్​ను ఎంపిక చేసే చాన్సుంది. ఇక డిప్యూటీ మేయర్ పోస్టు జనరల్ కేటగిరీకి ఇవ్వనున్నట్టు చర్చ జరుగుతోంది. ఆశావహుల లిస్టులో 52వ డివిజన్ కార్పొరేటర్ సాయిని స్రవంతితో పాటు పలువురు రేసులో ఉన్నారు.

ఆసిఫాబాద్​లో అబ్దుల్లా, కార్తీక్, ఆకాశ్ పేర్లు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్​పర్సన్ కు తీవ్ర పోటీ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఇండిపెండెంట్లు చైర్​పర్సన్ పదవి ఇస్తేనే మద్దతిస్తామని స్పష్టం చేస్తున్నారు. 

బీసీ జనరల్ కు కేటాయించిన పదవి కోసం కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు అబ్దుల్లా, రాపత్తి కార్తీక్, బీఆర్ఎస్ నుంచి ఆకాశ్, ఇండిపెండెంట్ అభ్యర్థి వైరగడే గోవింద్ ఆశిస్తున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ ఇండిపెండెంట్లు కీలకమయ్యారు. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, బీఆర్ఎస్ నుంచి మాజీ చైర్ పర్సన్ సీపీ విద్యావతి, బీజేపీ నుంచి కొత్తపల్లి అనిత చైర్ పర్సన్ బరిలో ఉన్నారు.

ఖానాపూర్​లో ఆసక్తికర రాజకీయం.. కాంగ్రెస్​లో చేరిన ఇండిపెండెంట్

ఖానాపూర్,  వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. బీఆర్ఎస్, బీజేపీ చేరో 4 సీట్లు సాధించాయి. మూడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సాజిద బేగం వెంటనే నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఖానాపూర్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవాలంటే ఇరు పార్టీలకు ఆరుగురు సభ్యులు తప్పనిసరి. 

ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడంతో బేరసారాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ 2వ వార్డు కౌన్సిలర్ రాజ గంగన్న, బీజేపీ 9వ వార్డు కౌన్సిలర్ అంకం మౌనిక చైర్​పర్సన్ రేసులో  ఉన్నట్లు జో రుగా ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్​పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పట్టుదలతో ఉన్నారు. దీంతో రాజకీయాలు ఎటు తిరగనున్నాయా అని పుర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

ఆదిలాబాద్​లో జోగు శైలజ, ఆకుల రేణుక, సుచిక, నిషిధ పేర్లు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 25 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగురనుంది. 2001 ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్​గా లాలా రాధేశ్యాం సేవలందించగా, రెండేళ్ల తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీకి చైర్మన్ పీఠం దక్కలేదు. తాజా ఎన్నికల్లో 21 వార్డుల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ రెండో సారి చైర్​పర్సన్ పదవి దక్కించుకోనుంది. 

దీంతో ఆ పార్టీ చైర్​పర్సన్ సీటు కోసం పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్​పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో 27వ అభ్యర్థి జోగు రవి శైలజ పేరు ముందుగా వినిపిస్తోంది. 48 వార్డు నుంచి గెలిచిన ఆకుల రేణుక, పవార్ సుచిక, నిషిధ కండేష్కర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​ సంధ్యారాణి!

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపల్ చైర్​పర్సన్​గా 17వ వార్డు నుంచి విజయం సాధించిన డాక్టర్​గొడిసెల సంధ్యారాణిని వరించే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులుండగా ఎన్నికల్లో 10 వార్డుల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్న సీపీఐ నుంచి నలుగురు గెలిచారు. కాగా మున్సిపల్​ చైర్​పర్సన్​గా 17వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్​అభ్యర్థి సంధ్యారాణి ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. 

మరోవైపు వైస్​ చైర్మన్​గా బీఆర్​ఎస్​కు సపోర్టు చేస్తున్న 7వ వార్డు ఇండిపెండెంట్​లేదా సీపీఐ నుంచి గెలిచిన నలుగురిలో ఒకరిని వరించే ఛాన్స్​ఉంది. చెన్నూరు మున్సిపాలిటీలో 2వ వార్డు అభ్యర్థి పెద్దింటి పద్మ, 9వ వార్డు అభ్యర్థి సుద్దపల్లి సునీత, 15వ వార్డు అభ్యర్థి కొమ్మెర జయలక్ష్మిలో ఒకరిని చైర్ పర్సన్​ పీఠం వరించనుందని ప్రచారం జరుగుతోంది.