Jane Street: స్టాక్ మార్కెట్లో రూ.43వేల కోట్ల కుంభకోణం.. హర్షద్ మెహతా స్కామ్‌కి మించిన స్టోరీ..

Jane Street: స్టాక్ మార్కెట్లో రూ.43వేల కోట్ల కుంభకోణం.. హర్షద్ మెహతా స్కామ్‌కి మించిన స్టోరీ..

Jane Street Scam: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో స్కామ్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హర్షద్ మెహతా కుంభకోణం. అయితే దీనిపై ఇటీవల లక్కీ భాస్కర్ అనే సినిమా కూడా తెలుగులో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ క్యాపిటల్ సంస్థ భారత స్టాక్ మార్కెట్లో చేసిన భారీ కుంభకోణాన్ని సెబీ గుర్తించింది. 

జనే స్ట్రీట్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీకి భారతదేశంలో కూడా కార్యకలాపాలు ఉన్నాయి. జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఎక్స్ పెయిరీ రోజున అక్రమ పద్ధతుల్లో చేసిన లావాదేవీల ద్వారా రూ.43వేల 290 కోట్లు లాభాలను ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. సంస్థ చట్టవిరుద్దంగా లాభాలను ఆర్జించినట్లు ఆరోపణలతో రూ.4వేల 843 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ ఆదేశించింది. 

పైగా జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకుండా, ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధిస్తున్నట్లు సెబీ వెల్లడించింది. సెబీ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం అమలులో ఉంటుంది. అలాగే సంస్థ జప్తు చేసిన ఆస్తుల సొమ్మును షెడ్యూల్డ్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో ఉంచాలని, దానిపై సెబీకి హక్కు ఉండేలా చూడాలని జేన్ స్ట్రీట్ సంస్థకు వెల్లడించింది. అంటే సెబీ అనుమతి లేకుండా ఈ ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయటం కుదరదు. అలాగే జేన్ స్ట్రీట్ కి చెందిన అన్ని ఖాతాలను వెంటనే డెబిట్ ఫ్రీజ్ చేయాలని సెబీ దేశంలోని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 

కంపెనీ జనవరి 2023 నుంచి మార్చి 31, 2025 వరకు భారత స్టాక్ మార్కెట్లలో అక్రమ పద్ధతుల ద్వారా చేసిన ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల రూ.43వేల కోట్లకు పైగా లాభాలను ఆర్జించిందని సెబీ వెల్లడించింది. వాస్తవానికి ఏప్రిల్ 2024లో సంస్థ కార్యకలాపాలపై వచ్చిన కొన్ని మీడియా కథనాల తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ దీనిపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సెబీ కూడా చర్యలు చేపట్టడం ప్రారంభించింది. 

దీని తర్వాత సెబీ భారత స్టాక్ మార్కెట్లలో ఆప్షన్స్ ఎక్స్ పెయిరీ రోజున వస్తున్న అధిక ఓలటాలిటీని అరికట్టేందుకు కొత్త చర్యలు, నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో జేన్ స్ట్రీట్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్లు పరిశీలించిన సెబీ కొన్ని విషయాలను గుర్తించింది. అయితే నోటీసుల తర్వాత కూడా జేన్ సంస్థ తన ట్రేడింగ్ మాత్రం ఆపలేదని తేలింది. దీంతో ప్రస్తుతం జేన్ స్ట్రీట్ కి చెందిన JSI Investments Pvt Ltd, JSI2 Investments Pvt Ltd సంస్థలపై ప్రస్తుతం ట్రేడ్ బ్యాన్ తీసుకొస్తూ సెబీ చర్యలు చేపట్టింది.