- హైదరాబాద్లోని ఓ పార్క్లో పనుల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కు పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్‌ని ఆపి, నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. పూర్తిగా చెత్తా చెదారంతో నిండి.. కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే సీఎం పార్కులో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకునేందుకు అకస్మాత్తుగా సందర్శించారు. పార్కులో పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి.. వారిని పలకరించారు. పార్కు నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కూలీలు ఎదుర్కొంటున్నa సమస్యలపై ఆరా తీశారు. అమ్మా.. ఎట్లున్నరు అంటూ కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఈ పార్కు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
