పీఆర్సీ బకాయిల చెల్లింపునకు సింగరేణి ఓకే

పీఆర్సీ బకాయిల చెల్లింపునకు సింగరేణి ఓకే
  • ఏడేండ్లకు చెందిన రూ. 63 కోట్లు చెల్లించనున్న యాజమాన్యం  
  • గత రెండేండ్ల పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరుతున్న ఆఫీసర్లు ​ 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఏడేండ్ల  పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు గురువారం సింగరేణి ఓకే చెప్పింది. ఇందుకు కోల్​మైన్స్​ఆఫీసర్స్​అసోసియేషన్​ఆఫ్​ఇండియా (సీఎంఓఏఐ)కు సమాచారం ఇచ్చింది. బొగ్గు పరిశ్రమల్లోని ఆఫీసర్లకు  పెర్ఫార్మెన్స్​రిలేటెడ్​పే (పీఆర్పీ) చెల్లించేందుకు కోల్​ఇండియాతో పాటు సింగరేణి ముందుకొచ్చింది. సంస్థలు లాభాల్లోకి రావడంలో ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తుండగా.. జీతంతో సంబంధం లేకుండా కొంత ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని యాజమాన్యాలు భావించాయి. 2007–08 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకోగా.. ప్రభుత్వాలతో సరైన చర్చలు లేక, ఇతరత్రా కారణాలతో చెల్లింపులు లేట్ అయ్యాయి. 

2007–08  నుంచి 2013–14 వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సీఎంఓఏఐ తరఫున పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. బకాయిలు చెల్లించాలని ఆదేశాలిచ్చినా యాజమాన్యాలు లేట్ చేశాయి. పలుమార్లు ఆఫీసర్లు కూడా యాజమాన్యాన్ని కోరగా..  ఏడేండ్ల బకాయిలు రూ. 63 కోట్లు చెల్లించనున్నట్టు సింగరేణి నిర్ణయించింది.  దీంతో ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లోని దాదాపు రూ. 117 కోట్లు పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. 

వీటిని కూడా చెల్లించాలని డిమాండ్​చేస్తూ ఇటీవలి సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఆఫీసర్లు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​ఎదుట ధర్నా చేశారు.  పీఆర్పీ బకాయిలు చెల్లించేందుకు సింగరేణి ముందుకు రావడం పట్ల సీఏఓఎఐ సింగరేణి అధ్యక్షుడు టి. లక్ష్మీపతి గౌడ్​హర్షం వ్యక్తం చేశారు.  సీఎండీ ఎన్​. బలరామ్​కు యూనియన్​తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు చెందిన పీఆర్పీ బకాయిలు కూడా చెల్లించేందుకు చైర్మన్​చొరవ చూపాలని ఆయన కోరారు.