
- బీఎన్ఐ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో ప్రారంభం
- 200 పైగా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శన
హైదరాబాద్, వెలుగు: మనరాష్ట్రంలో ఒకట్రెండు నెలల్లో ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్లాట్‌ఫారాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇది ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. బిజినెస్ రిఫరల్ సంస్థ బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన 'బీఎన్ఐ వాంటేజ్ గోనాట్ 2025' ఎంఎస్ఎంఈ ఎక్స్‌పోను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో, సెమినార్ అని పేర్కొన్నారు.
పెద్ద సంస్థలతో పోటీపడేందుకు ఎంఎస్ఎంఈలకు సమానమైన వేదికను కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక యువ రాష్ట్రంగా దేశంలో తొలి ఎంఎస్ఎంఈ పాలసీ రూపొందించిందన్నారు. ఇది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించేది, వేతనాలు అందించేది ఇవేనన్నారు. ఈ పరిశ్రమలకు సాంకేతికత ఎంతో అవసరమని మంత్రి స్పష్టం చేశారు.
డ్రైపోర్టులు నిర్మిస్తున్నాం..
‘‘బీఎన్ఐ వంటి నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యాపారవేత్తలకు ఎంతో సహాయపడుతున్నాయి. ప్రభుత్వం అవకాశాలు, వేదికలు అందిస్తే సరిపోదు. వ్యాపారవేత్తలు కూడా నెట్‌వర్క్‌ను పెంచుకుని ముందుకు సాగాలి. రాష్ట్రంలో రెండు డ్రైపోర్టులను ఏర్పాటు చేయబోతున్నాం. ఒకటి పశ్చిమ దిశగా ముంబై వైపు, మరొకటి దక్షిణ దిశగా విజయవాడ వైపు ఉంటుంది. ఇవి ఉత్పత్తిదారులకు, తయారీదారులకు, ఎగుమతులకు ఎంతో ఉపయోగపడతాయి.
ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా ఎగుమతులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఎంఎస్ఎంఈలు ఎదగాలంటే నూతన ఆవిష్కరణల్లోనూ, సాంకేతికతలోనూ పెట్టుబడి పెట్టాలి. అప్పుడే పోటీలో ముందుకు వెళ్లగలుగుతారు”అని అయన అన్నారు.
ఈ సందర్భంగా బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మాట్లాడుతూ ఈ వేదిక వేలాది ఎంఎస్ఎంఈలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, తమ పరిధిని విస్తరించడానికి సహాయపడిందని తెలిపారు. రెండు రోజులు జరిగే ఈ ఈవెంట్ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ నాయకులు, వ్యాపార దృక్పథం కలిగిన వారిని ఒకే వేదికపై చేర్చిందని అన్నారు.