
- రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు
- వీళ్లలో మహిళలు 85,35,935.. మగవాళ్లు 81,66,732
- పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు పైగా ఎక్కువ
- రాష్ట్రంలోని 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సర్కారు నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలు, వార్డులవారీగా పోలింగ్ కేంద్రాలు, తుది ఓటరు జాబితాను జిల్లాలవారీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. తాజా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో గ్రామీణ జనాభా1.95 కోట్లు కాగా.. గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 85,35,935, పురుషు ఓటర్లు 81,66,732 మంది ఉండగా.. ఇతరులు 504 మంది ఉన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలే ఉండడం విశేషం.. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కానున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షలపై చిలుకు మహిళా ఓటర్లు ఉన్నట్లు లెక్కతేలింది.
నల్గొండ జిల్లాలో గ్రామీణ ఓటర్లు ఎక్కువ..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 5,42,589, పురుషులు 5,30,860, ఇతరులు 57 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో 8,51,417 మంది ఓటర్లు కాగా.. మహిళలు 4,54,621, పురుషులు 3,96,778 మంది ఉన్నారు. మూడోస్థానంలో ఉన్న ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 8,02,690 కాగా.. పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది ఉన్నారు. గ్రామీణ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా ములుగు కాగా... ఈ జిల్లాలో మొత్తం ఓటర్లు 2,29,159 మంది. ఇందులో పురుషులు 1,10,838, మహిళలు 1,18,299 ఇతరులు 22 మంది ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 6,55,958 ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళా ఓటర్లు 3,21,766, పురుష ఓటర్లు 3,34,186 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 5,56,780 ఓటర్లు ఉండగా.. మహిళలు 2,83,064, పురుషులు 2,73,692, ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్‌లో మొత్తం 4,49,981 ఓటర్లు ఉండగా.. పురుషులు 2,19,652, మహిళలు 2,30,313, ఇతరులు 16 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో స్థానిక పోరులో అధిక శాతం మంది మహిళలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఏరకంగా చూసినా ఈ సారి గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కొత్తగా ఇబ్రహీంపేట గ్రామానికి ఎన్నిక
రాష్ట్రంలో జనాభాను బట్టి ఎంపీటీసీ స్థానాలను వర్గీకరించారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 565 ఎంపీపీ, జడ్పీటీసీ, 31 జడ్పీ స్థానాలు ఉన్నాయి. 12,760 గ్రామ పంచాయతీలుండగా.. వార్డుల సంఖ్య 1,12,534 కు చేరింది. 1,12,720 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు. దానికి ఆయన ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ లెక్కలో స్వల్ప మార్పులు, చేర్పులు చోటు చేసుకునే చాన్స్ ఉంది. మున్సిపాలిటీ నుంచి వేరైన ఇబ్రహీంపేట గ్రామానికి కూడా సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నిక జరగనున్నది.
స్థానిక ఎన్నికలకు మరికొంత టైమ్!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ బిల్లులపై కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడం.. గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు పంపిన పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉండటంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అమలు ప్రధాన అడ్డంకిగా మారింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఇప్పటివరకూ గవర్నర్ ఆమోదం తెలపకపోవడం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించవద్దనే నిబంధనలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.