
- అక్రమ వలసలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
- వీధుల్లోకి లక్షన్నర మంది జనం
- భారీగా పోలీసుల మోహరింపు
- ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు
- ఇమిగ్రెంట్లకు మద్దతుగా 5 వేల మందితో మరో ర్యాలీ
లండన్: బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘అక్రమ వలసలను అడ్డుకోండి’.. ‘మా దేశాన్ని మాకివ్వండి’ అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. ప్రముఖ జర్నలిస్ట్, జాతీయవాద యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో శనివారం లండన్ నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీలో సుమారు1.50 లక్షల మంది పాల్గొన్నారు.
‘యునైటెడ్ కింగ్ డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులంతా బ్రిటన్ జాతీయ జెండాలు, సెయింట్ జార్జ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘పడవలను ఆపండి’, ‘వారిని తిరిగి పంపండి’, ‘ఇక చాలు, మన పిల్లలను కాపాడండి..’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మరోవైపు, వలసదారులకు మద్దతుగా స్టాండప్ టు రేసిజం గ్రూపు ఆధ్వర్యంలో ‘మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం’ పేరుతో సపరేట్గా మరో ర్యాలీ జరిగింది.
ఇందులో సుమారు 5 వేల మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎంపీ డియానే అబాట్ మాట్లాడుతూ.. ఫాసిజాన్ని ఓడించాలని, శరణార్థులకు సంఘీభావం తెలపాలన్నారు. లండన్లో ఒకేరోజు పోటాపోటీగా రెండు నిరసన ర్యాలీలు జరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులను మోహరించారు. అయితే, యునైటెడ్ కింగ్ డమ్ ర్యాలీలో అక్కడక్కడా పోలీసులపై దాడులు జరిగాయి. పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది బ్రిటిష్ ప్రజలకు మేలుకొలుపు: రాబిన్సన్
ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఉద్యమమని, బ్రిటిష్ ప్రజలకు మేలుకొలుపు వంటిదని ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడైన టామీ రాబిన్సన్ (అసలు పేరు స్టీఫెన్ యాక్స్ లీ లెనాన్) అన్నారు. అయితే, బ్రిటన్కు అక్రమ వలసలు పెరగడం వల్ల ముస్లింల ఆధిపత్యం పెరుగుతోందని, తమ సంస్కృతి పూర్తిగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని నిర్మించిన బ్రిటిష్ ప్రజల కంటే వలసదారులకే కోర్టుల్లో ఎక్కువ హక్కులు ఉంటున్నాయన్నారు.
అందుకే నేడు బ్రిటన్లో కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభమైందన్నారు. ఈ ర్యాలీలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఫ్రెంచ్ పొలిటీషియన్ ఎరిక్ జెమౌర్ కూడా వర్చువల్గా మాట్లాడారు. ముస్లింల వలసల వల్ల బ్రిటన్ కు ముప్పు తప్పదని, ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయకపోతే నాశనం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఇస్లామిక్ స్టేట్, పాలస్తీనా, ముస్లిం బ్రదర్ హుడ్ జెండాలను చింపివేస్తూ నిరసనలు తెలిపారు.
అక్రమ వలసల వల్ల బ్రిటన్ సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా మారిపోతోందని, బ్రిటన్ సొంత కల్చర్ ను తిరిగి తీసుకొద్దామని రాబిన్సన్ ఫాలోవర్లు పిలుపునిచ్చారు. ఇది ఫాసిజం కాదని, దేశభక్తి వాదమని స్పష్టం చేశారు.
కీర్ స్టార్మర్ మౌనం..
అక్రమ వలసలకు వ్యతిరేకంగా లండన్లో జరిగిన భారీ నిరసన ర్యాలీపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైలెంట్ అయ్యారు. అంతేకాకుండా, శనివారం లండన్ లో నిరసనలు జరుగుతున్న సమయంలోనే ఎమిరేట్స్ స్టేడియంలో ఆయన కొడుకుతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.